మనమడి ప్రమోషన్ మొదలైంది

Update: 2015-12-28 03:54 GMT
పెద్దోళ్ల ముందుచూపు చూస్తే ముచ్చటేస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే తీరు చూసినప్పుడు.. ఔరా ఎంత ముందు జాగ్రత్తగా అని అనిపించక మానదు. బుజ్జి బుజ్జిగా ఉంటే అబ్బాయిని భవిష్యత్తు వారసుడన్న విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పేయటం చూసినప్పుడు తాతగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్న కేసీఆర్ కనిపిస్తారు.

ఐదు రోజుల పాటు అద్భుతంగా నిర్వహించిన అయుత చండీయాగం ముగింపు సందర్భంగా వందలాది రుత్వికులను ఉద్దేశించి కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. మరి.. ముఖ్యంగా తన మనమడు గురించి కేసీఆర్ చెప్పిన మాటలు అందరిని ఆకర్షించాయి. తన మనమడి తీరు చూసి ముచ్చటపడిపోయిన కేసీఆర్.. అతగాడి గొప్పతనం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. యాగం సందర్భంగా తాన సాష్టాంగ నమస్కారం చేస్తే.. తన మనమడుసాష్టాంగ నమస్కారం చేస్తున్నాడని.. దీన్ని చూసిన అయ్యవార్లు మీ మనమడికి కూడా మీ సంస్కారం నేర్పిస్తున్నారే అంటూ వ్యాఖ్యానించారని చెప్పుకొచ్చారు.

అయ్యవార్ల నోట ఆ వినటం నాకు సంతోషం కలిగించింది. మీ అందరి ఆశీస్సులు నా మనమడికి ఉండాలంటూ కేసీఆర్ తన మనసులోని మాటను చెప్పకనే చెప్పేశారు. మనమడ్ని (కేటీఆర్ కుమారుడు) విపరీతంగా అభిమానించే కేసీఆర్.. తాజాగా మనమడు ఫోకస్ అయ్యేలా చేసిన తీరు చూస్తుంటే.. కొడుకు తర్వాత తరానికి సంబంధించిన వారసుడ్ని కేసీఆర్ ప్రకటించినట్లేనన్న భావన వ్యక్తమవుతోంది. ‘‘నా మనమడికి మీ అందరి ఆశీస్సులు లభంచినయి’’ అంటూ చేసిన వ్యాఖ్యను చూసినప్పుడు తర్వాతి తరం ప్రమోషన్ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ షురూ చేసినట్లుగా అనిపించక మానదు.
Tags:    

Similar News