తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత - ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రసంగం శైలికి తాజా నిదర్శనం ఇది. సందర్భానుసారం మనసును గెలుచుకునేలా ప్రసంగించడంలో కేసీఆర్‌ది అందెవేసిన చేయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ప్రసంగం తీరునే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా మరోమారు కేసీఆర్ ప్రదర్శించి చూపారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కోవింద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటించారు . రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్ నాథ్ కు భారీ విజయం దక్కుతుందని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో తన ప్రగతి కోసం మీ ఆశీస్సులు కోరుకుంటుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రపతి కార్యాలయంలో మీరు పూర్తి సఫలత సాధించాలని ఆశిస్తున్నట్లు కూడా కేసీఆర్ తెలిపారు. దేశాన్ని ఆర్థిక వృద్ధి దిశగా తీసుకెళ్లుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తమ పూర్తి మద్దతు ఉంటుదని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండేవన్నారు. కరెంటు కష్టాలు తీవ్రంగా ఉండేవని, ఆ సమస్యలను పరిష్కరించుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ పవర్ సర్‌ప్లస్ రాష్ట్రంగా మారిందన్నారు. తక్కువ సమయంలోనే రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపామన్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణ ప్రథమంగా ఉందన్నారు. వృద్ధులు, వికలాంగులకు నెలనెలా పెన్షన్ ఇచ్చి ఆదుకున్నామన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులిస్తున్నామన్నారు. రెండేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రానికి మొదటి ర్యాంక్ వస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు.
కాగా, ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ ను సీఎం కేసీఆర్ శాలువ కప్పి - పుష్ఫగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. కోవింద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో సీఎం కేసీఆర్ - టీఆర్ ఎస్ నేతలతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ - వెంకయ్యనాయుడుతో పాటు టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు - మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు సీఎం కేసీఆర్ ఆహ్వానితులను రామ్ నాథ్ కోవింద్ కు పరిచయం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/