లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదు:కేసీఆర్

Update: 2020-04-06 15:02 GMT
కరోనా కట్టడి కోసం కేరళ - రాజస్థాన్ - మహారాష్ట్ర తర్వాత అత్యంత పటిష్టమైన చర్యలు చేపట్టిన రాష్ట్రం తెలంగాణ. ముందు కరోనా తీవ్రతను అంచనా వేయడంలో పొరబడ్డ సీఎం కేసీఆర్...ఆ తర్వాత వెంటనే తేరుకొని తెలంగాణలో షట్ డౌన్ విధించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంలో కేసీఆర్ అంతే కఠినంగా వ్యవహరించారు. తెలంగాణలో కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్న కేసీఆర్....తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో లాక్ డౌన్ పొడగింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్ తో పాటు పలు యావత్ ప్రపంచం మునుపెన్నడూ చూడని సంక్షోభం చవిచూస్తోందని కేసీఆర్ అన్నారు. భారత్ వంటి దేశంలో లాక్ డౌన్ ఒక్కటే కరోనాను కట్టడి చేయగలదని....లాక్ డౌన్ కు తెలంగాణతో పాటు దేశ ప్రజలు ఎంతో సహకరించారని కేసీఆర్ అన్నారు. జూన్ వరకు లాక్ డౌన్ పొడిగించాలని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక ఇచ్చిందని, తాను కూడా అదే మంచిదని అభిప్రాయపడుతున్నానని అన్నారు.

ప్రధాని మోడీతో కూడా తాను లాక్ డౌన్ పొడిగిస్తేనే బాగుంటుందని చెప్పానని - రోజుకు రెండు సార్లు ప్రధానితో కూడా మాట్లాడుతున్నానని చెప్పారు. కరోనా వల్ల దేశ లేదా రాష్ట్ర ఎకానమీ దెబ్బతింటే ఎలాగోలా రికవర్ కావచ్చని - కానీ వేల సంఖ్యలో ప్రాణాలు పోతే రికవర్ చేయడం కష్టమని కేసీఆర్ అన్నారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే....ఒక్కసారిగా జనాలు బయటకు వస్తారని - వారిని కట్టడి చేయడం కష్టమని అన్నారు. ప్రధాని మోడీతో మాట్లాడుతున్నామని - కేంద్రంతో ఎప్పటికపుడు టచ్ లో ఉన్నామని చెప్పారు. 2400 కోట్ల ఆదాయం రావాల్సిన చోట 6 కోట్ల ఆదాయం వస్తోందని...లాక్ డౌన్ పొడిగించాలని ఎవరికీ ఉండదని కానీ పరిస్థితులు అలా ఉన్నాయని అన్నారు. 22 దేశాలు పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయని - 90 దేశాలు పాక్షికంగా అమలు చేస్తున్నాయంటే పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ఊహించవచ్చని అన్నారు.  తానైతే లాక్ డౌన్ పొడిగింపునకే మొగ్గుచూపుతున్నానని అన్నారు. లాక్‌ డౌన్‌ కొనసాగింపుపై చర్చలు కొనసాగుతున్నాయని - తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని కేసీఆర్ అన్నారు.  దేశంలో లాక్‌ డౌన్ వల్ల కరోనా ఉధృతి తగ్గిందని అన్నారు.

అయితే, మన దేశ జనాభాతో పోలిస్తే కరోనా పాజిటివ్‌ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయని ఉన్నాయని - మరీ భయానక పరిస్థితులు లేవని కేసీఆర్ అన్నారు. అమెరికా వంటి దేశాల్లోనే కరోనా పంజా విసురుతోందని - శవాలను ట్రక్కుల్లో తరలిస్తున్నారని చెప్పారు. భారత్ లో ఆ పరిస్థితి వస్తే తట్టుకోలేమని అన్నారు. తెలంగాణలో కరోనా బారినపడ్డ వారు కోలుకుంటున్నారని, ప్రస్తుతం గాంధీలోని క్వారంటైన్‌ లో 364 పాజిటివ్‌ కేసులున్నాయని చెప్పారు. ఆ కేసుల సంఖ్య మరో 100-150 వరకు పెరగవచ్చని చెప్పారు. 364లో 308 యాక్టివ్ కేసులున్నాయని - ఇప్పటికే క్వారంటైన్ నుంచి 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారని చెప్పారు. నిజాముద్దీన్‌ లింక్‌ ఉన్న 1089 మందిని గుర్తించామని, వారిలో 172 మందికి వైరస్‌ సోకిందని అన్నారు. వారి ద్వారా 3వేల మందికి కరోనా సోకిందని...వారందరినీ క్వారంటైన్ లో పెట్టామని అన్నారు. ఇక కరోనా వల్ల రాష్ట్రం వ్యాప్తంగా 11 మంది మరణించారని కేసీఆర్ అన్నారు. అందరూ ఢిల్లీ నుంచి వచ్చిన వారేనని అన్నారు.




Tags:    

Similar News