తాను చేసే పని తనకే ఎదురైతే కేసీఆర్ రియాక్షన్ ఏమిటంటారు?

Update: 2021-11-26 01:30 GMT
ప్రజా నాయకుడు అంటే.. ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండేవాడు.. వారితో మమేకమైనోడుగా చెబుతాం. అందులోని ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కేసీఆర్ లాంటి నేత.. ప్రజల్లో ఒకడిగా ఉండటమే కాదు.. ఎవరికైనా ఏదైనా కష్టమొస్తే తాను ఉన్నానన్నట్లుగా వ్యవహరిస్తే ఆయన్ను ఢీ కొట్టే నేత తెలంగాణలో ఎవరూ రారనే చెప్పాలి. మనం అనుకున్న గుణాలన్ని అందరూ అభిమానించే అధినేతలో ఉండాలనుకోవటం అత్యాశే అవుతుంది.

అందునా.. కేసీఆర్ లాంటి మహానేతకు కొన్నిరిజర్వేషన్లు ఉంటాయన్నది తెలిసిందే. తన జీవితంలో తనకు ఎదురైన ఎదురుదెబ్బలు.. ఎత్తు పల్లాల కారణంగా ఆయనో ప్రత్యేకమైన మైండ్ సెట్ ఉన్న అధినేతగా కనిపిస్తారు. ఆయన చేష్టలు కూడా అలానే ఉంటాయి.

దేశంలోని మరే రాష్ట్రంలోనూ విపక్ష నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ మాత్రమేనని చెప్పాలి. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు తీసుకున్నకొత్తల్లో కమ్యునిస్టు నేతలు పలువురు ఆయన్నుకలవటానికి వస్తే..గంటల కొద్దీ వెయిట్ చేయించి.. తర్వాత కుదరదని తిప్పి పంపించిన వైనానికి షాక్ తిన్న పరిస్థితి. ఆ మాటకు వస్తే.. మంత్రులు మొదలు పార్టీ నేతలు ఎవరైనా.. ఏ స్థాయి వారైనా సరే.. తాను అనుకుంటే తప్పించి మిగిలిన సందర్భాల్లో ఎవరికి దర్శనం ఇవ్వని ప్రత్యేకత కేసీఆర్ సొంతం.

అంత దాకా ఎందుకు.. కొంతకాలం క్రితం కేంద్రమంత్రి ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తే.. సీఎం కేసీఆర్ అందుబాటులోకి రాకపోవటం.. ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావనకురావటం మర్చిపోకూడదు. అలాంటి కేసీఆర్.. సీనియర్ నేత ఈటల రాజేందర్ చేసిన అక్రమాల మీద ఫిర్యాదు చేయటానికి వచ్చిన రైతులకు అపాయింట్ మెంట్ లభించటమే కాదు.. వారిని కలిసి.. వారుచెప్పిందంతా విని.. అధికారులకు ఆదేశాలు జారీ చేయటం లాంటివి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకతలుగా చెప్పాలి.

ఇలా దేశంలో మరే సీఎంకు లేని ఎన్నో ప్రత్యేకతలు సీఎం కేసీఆర్ సొంతం.అలాంటి పెద్ద మనిషి.. ధాన్యం కొనుగోలు విషయం మీద కేంద్రాన్ని నిలదీయటం కోసం.. ప్రధాని మోడీని ప్రశ్నించటం కోసం ఢిల్లీకి వెళ్లటం.. ఆయన అపాయింట్మెంట్ కోసం దగ్గర దగ్గర నాలుగు రోజులు ప్రయత్నించి.. సాధ్యం కాకపోవటంతో హైదరాబాద్ కు తిరిగి రావటం తెలిసిందే. ఏదో ఒక మంచి రోజున.. మాంచి మూడ్ వచ్చినంతనే ప్రెస్ మీట్ పెట్టేసి.. ముఖ్యమంత్రి అయిన తనకు టైమివ్వని ప్రధాన మంత్రిని తూర్పార పట్టే రోజు దగ్గర్లోనే ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ప్రధానమంత్రి లాంటి ప్రముఖుడి వద్దకు వెళ్లే వేళ.. ఆయన అపాయింట్ మెంట్ గురించి ఆరా తీసి.. ఆయన టైమిచ్చిన తర్వాత హైదరాబాద్ లో ప్రత్యేక విమానం ఎక్కితే బాగుంటుంది కానీ.. అలాంటిదేమీ లేకుండా తాను అనుకున్నంతనే ప్రధాని టైం ఇవ్వాలనుకోవటం అత్యాశే అవుతుంది.

ఒక మోస్తరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆరే.. సొంత ప్రభుత్వంలోని మంత్రులకే టైం ఇవ్వని వేళ.. తనకు మించిన స్థాయిలో ఉన్న మోడీ లాంటి ప్రధాని.. తాను కోరుకున్నంతనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తారని కేసీఆర్ ఎలా అనుకుంటారు. ఏమైనా.. అందరికి తాను చూపించే అనుభవాన్ని.. మోడీ ఆయనకు చూపించిన వేళ కేసీఆర్ ఫీలింగ్స్ ఏమిటన్న విషయం మీద క్లారిటీ రావాలంటే.. ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. అప్పుడు మాత్రమే.. గులాబీ బాస్ ఫీలింగ్స్ బయటకు వచ్చే ఛాన్సుంది.
Tags:    

Similar News