కేంద్రబడ్జెట్ పై కేసీఆర్ రియాక్షన్ మామూలుగా లేదు

Update: 2022-02-01 10:30 GMT
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని ఆడిపోసుకున్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు దేశ రైతాంగం, సామాన్యులు, పేదలు, ఉద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. దశ, దిశ, నిర్ధేశం లేని నిష్ప్రయోజనకర బడ్జెట్ ఇది అని తీవ్రంగా ఆక్షేపించారు.

కేంద్రఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనం, మాటల గారడీతో కూడుకొని ఉందన్నారు. కేంద్రప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ సామాన్యులకు నిరాశ, నిస్పృహలకు గురిచేసిందన్నారు.

బడ్జెట్ మసిపూసి మారేడుకాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ ఇది అన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యం అన్నారు. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ బిగ్ జీరో అని కేసీఆర్ ధ్వజమెత్తారు.

దేశ చేనేత రంగానికి కూడా ఈ బడ్జెట్ సున్నా చుట్టిందని కేసీఆర్ విమర్శించారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులు, చిరు వ్యాపారులకు తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.

ఆదాయపు పన్ను స్లాబ్ లను మార్చకపోవడం విచారకరమన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురుచూసిన ఉద్యోగ వర్గాలు, పన్ను చెల్లింపుదారులపై కేంద్ర బడ్జెట్ నీరు చల్లిందని ఆరోపించారు.

వైద్యం, ప్రజారోగ్యం, మౌలిక రంగాలను అభివృద్ధి చేయడంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేటతెల్లమైందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలికసదుపాయాలను అభివృద్ధి చేస్తుంటే ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమని విమర్శించారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని కేసీఆర్ విమర్శించారు.

    

Tags:    

Similar News