కేసీఆర్ చెప్పినంత నీళ్ల పంచాయితీ ఉందా? అసలు లెక్కేంటి?

Update: 2021-06-23 05:30 GMT
అంతా బాగానే ఉందనుకునే వేళలో.. అనుకోని విధంగా మరో నింద ఏపీ మీద పడింది. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుందని.. దీనితో పాలమూరు ఎడారిగా మారుతుందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం మీదా.. ఏపీ ముఖ్యమంత్రి మీదా కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశం మీడియాలోనూ ప్రముఖంగా వచ్చింది. అయితే.. దీనిపై వెంటనే స్పందించలేదు ఏపీ సర్కారు.

రెండు..మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై అధ్యయనం చేసి.. ఇరిగేషన్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఏపీ మంత్రి అనిల్ తన సహజతీరుకు భిన్నంగా పాయింట్ టు పాయింట్ మాట్లాడారు. తాము నిబంధనలకు లోబడే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామే తప్పించి.. ఎలాంటి తప్పులు చేయటం లేదని స్పష్టం చేశారు.

సహజ ఆవేశాన్ని సైతం పక్కన పెట్టేసిన అనిల్..తెలంగాణ ప్రభుత్వం మీద కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కానీ ఎలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయకుండానే మీడియా భేటీని ముగించారు. అంతేకాదు.. ఏదైనా పంచాయితీ ఉంటే బోర్డు దగ్గర తేల్చుకుందామని చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు.

ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టును అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని.. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని అడ్డుకోవాలని కేంద్రాన్ని.. కృష్ణా బోర్డును కోరింది. గతంలో తాము పలుమార్లు ఫిర్యాదు చేశామని.. ఎన్జీటీలోనూ కేసు సాగుతుందని చెప్పింది. అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని కేంద్రం.. బోర్డు.. ఎన్జీటీ సూచించినా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం పనులు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. లేఖతో పాటు నిర్మాణం జరుగుతున్న చిత్రాల్ని కూడా జత చేశారు.

తెలంగాణ చేస్తున్న ఫిర్యాదును జాగ్రత్తగా గమనిస్తే.. గతంలోనే తాము కంప్లైంట్లు ఇచ్చామన్న మాట వినిపిస్తోంది. గతంలో ఫిర్యాదులు ఇచ్చినప్పుడు.. దానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల్ని నిర్మిస్తూ ఉంటే..తరచూ మాట్లాడాలి కదా? అందుకు భిన్నంగా గడిచిన రెండేళ్లుగా ప్రస్తావించని అంశాల్ని ఇప్పుడే ఎందుకు తెర మీదకు తీసుకొచ్చినట్లు? కేసీఆర్ దూకుడుగా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

కేసీఆర్ చెబుతున్నదాని ప్రకారం రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్ లో లేని అన్ని ప్రాజెక్టులు కొత్తవిగానే భావించాలన్నది ఆయన వాదన. అదే నిజమైన పక్షంలో..11వ షెడ్యూల్ లో లేని పాలమూరు రంగారెడ్డి, దిండి తదితర ప్రాజెక్టుల సంగతేంటి? దాని గురించి సీఎం కేసీఆర్ ఏమంటారు? ఇప్పడు వస్తున్న ఇబ్బంది అంతా ఏమంటే..తెలంగాణ చేపట్టే అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే వాడే లేరు. కానీ.. తన రాజకీయ ప్రయోజనాల్లో భాగంగా కేసీఆర్ మాత్రం తరచూ ఏదో ఒక లొల్లి చేయటం ఆయనకో అలవాటుగా మారింది.

సాగురంగ నిపుణుల మాట ప్రకారం చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల మద్య కృష్ణా జలాల కేటాయింపులకు సంబంధించి అసలు వివాదమే లేదు. చట్టబద్ధత గల బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో ఉంది. ఎవరి వాటా ఎంతో ఆ తీర్పులో స్పష్టంగా చెప్పారు. అయితే.. బచావత్ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా తెలంగాణ ప్రాంతం తరఫు సరైన వాదన వినిపించలేదనేది తెలంగాణ ఫిర్యాదు. న్యాయపరంగా చూస్తే ఇందుకు తగిన ఆధారం ఏమీ కనిపించదు. ప్రతి విషయంలోనూ ఏదో ఒక లొల్లి పెట్టుకోవాలన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్ తీరుతోనే సమస్య అంతా.

ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఉన్నట్లుండి.. ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నట్లు? ఏపీ ప్రభుత్వంతో పాటు.. కేంద్రంలోని మోడీ సర్కారునుఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు? అంటే.. అసలు విషయం నీళ్లు కాదు మరేదో ఉందన్నది అర్థమవుతుంది. రాష్ట్రంలో దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అధిక్యత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దీనికి తోడు ఈటల లాంటి నేతలు బీజేపీలోకి వెళ్లటమే కాదు.. సమయం సందర్భం చూసుకొని మరికొందరు గులాబీ కారు నుంచి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

ఇలాంటివేళ.. బలపడుతున్న బీజేపీని బలహీనపర్చటానికి కేసీఆర్ అమ్ములపొదిలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటే భావోద్వేగ బాణాన్ని బయటకు తీశారు. దానికి ఏపీ అక్రమ ప్రాజెక్టులు.. అన్న తోకను తగిలించి తాను మాత్రమే తెలంగాణ పక్షాన మాట్లాడతానని.. మరెవరికి రాష్ట్రం గురించి పట్టదన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. ఏపీ సర్కారుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దన్నుగా నిలిచిందన్న మాటతో.. తెలంగాణ బీజేపీ నేతల మీద నేరుగా గురి పెట్టకుండా ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేశారని చెప్పాలి. బాణం ఎక్కు పెట్టింది ఏపీ మీద అన్నట్లు కనిపించినా.. అంతిమలక్ష్యం తెలంగాణలో బీజేపీని బద్నాం చేయటం.. ఆత్మరక్షణలో పడేసి తాను అనుకున్నది సాధించటమని చెప్పక తప్పదు. ఏమైనా లేని వివాదాల్ని ఉన్నట్లుగా చూపించటంలో దిట్ట అయిన కేసీఆర్.
Tags:    

Similar News