బాబు మేలుకోకుంటే..కేసీఆర్‌ తన్నుకుపోతాడు!

Update: 2015-10-27 04:12 GMT
సాధారణంగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలనుంచి వసూలు చేసే రకరకాల పన్నుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక వాటా ఉంటుంది. పన్నులు మొత్తం వసూలైన తరువాత.. ఈ వాటా మొత్తాలను కేంద్రం కాస్త ముందు వెనుకగా రాష్ట్రాలకు జమ చేస్తూ ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు కేంద్రం నుంచి మన తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన సెంట్రల్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ లోని వాటాలు దాదాపు 7వేల కోట్లకు పైగా పేరుకుపోయి ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సొమ్మును తమ తెలంగాణ ఖజానాకు జమ చేయాల్సిందిగా ప్రస్తుతం కేసీఆర్‌ కేంద్రాన్ని కోరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆ సొమ్ములో కొత్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా గరిష్టమైన వాటా ఉంటుంది. అయితే.. ఏపీ సర్కారు గనుక.. త్వరగా నిద్ర మేలుకోకుంటే.. కేసీఆర్‌ కేంద్రాన్ని ఒప్పించి.. ఆ సొమ్మలను గద్దలా తన్నుకుపోయే ప్రమాదం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా సెంట్రల్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ కేంద్రం వసూలు చేస్తుంది. ఇందులో రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది. గతంలో 4 శాతం ఉన్న పన్నును క్రమంగా 2 శాతానికి తగ్గిస్తూ వచ్చిన కేంద్రం.. అందువలన రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని తాము భర్తీ చేస్తాం అంటూ హామీ ఇచ్చింది. ఇలాంటి పన్ను వాటాల రూపేణా తమకు కేంద్రం నుంచి రావాల్సిన మొత్తం ఎంత అని తెలంగాణలోని అధికారులు కసరత్తు చేసి.. 8100 కోట్ల రూపాయలుగా తేల్చారు. ఇందులో తమ సర్కారుకు ఇప్పటిదాకా 900 కోట్లు మాత్రం వసూలైనట్లు తేల్చారు.

అయితే ట్విస్టు ఏంటంటే.. ఈ మొత్తం బకాయి గత ఏడేళ్లుగా పేరుకుపోయి ఉన్నదిట. అంటే ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నప్పటినుంచి పేరుకుపోయిన బకాయిలు అన్నిటినీ కలిపితే అంతమొత్తం రావాలి. ఆ మిగిలిన ఏడువేల కోట్లు ఇచ్చేయమంటూ ఇప్పుడు కేసీఆర్‌ కేంద్రాన్ని అడగబోతున్నారు. కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకునేలోగా చంద్రబాబు కూడా.. మేలుకుని.. ఏపీకి రావాల్సిన వాటా ఎంత ఉంటుందో అధికారులతో లెక్కలు వేయించాలి. 7వేల కోట్లు బకాయిలు ఉన్నాయనుకున్నా సరే.. కనీసం 5 వేల కోట్లకు తక్కువ లేకుండా ఏపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత త్వరగా ఏపీ సర్కారు స్పందిస్తే అంత లాభం అని పలువురు సూచిస్తున్నారు.
Tags:    

Similar News