9 గంట‌లు పాట క‌లెక్ట‌ర్ల‌కు కేసీఆర్ ఏం చెప్పారు?

Update: 2017-04-11 09:09 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక అల‌వాటు ఉంది. ఆయ‌న రివ్యూ మీటింగ్‌లు ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో ఉండ‌వు. కానీ.. కొన్నిసంద‌ర్భాల్లో ఒక్కో అంశంపై ఆయ‌న ఫోక‌స్ చేస్తారు.అంతే.. వ‌రుస‌పెట్టి రివ్యూ మీటింగ్‌లు సాగుతుంటాయి. అలా సాగే రివ్యూ మీటింగ్‌ లు అదే ప‌నిగా సాగుతూ ఉంటాయి. ఇక‌.. టైం విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టింపులు ఉండ‌వు. తాజాగా జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉద‌యం 11 గంట‌ల‌కు మొద‌లైన మీటింగ్ రాత్రి ఎనిమిది గంట‌ల వ‌ర‌కూ సాగింది. అంటే.. నాన్‌ స్టాప్ గా 9 గంట‌ల‌న్న మాట‌.

క‌ద‌ల‌కుండా రెండున్న‌ర గంట‌ల పాటు (మ‌ధ్య‌లో బ్రేక్ ఇచ్చినా) సినిమా చూసేందుకే వామ్మో.. వాయ్యో అనే వేళ‌.. నాన్ స్టాప్ గా తొమ్మిది గంట‌లు (మ‌ధ్య మ‌ధ్య‌లో కాస్త గ్యాప్ ఉన్నా) ఏక‌బిగిన ఒక‌టే రివ్యూ అంటే మాట‌లుకాదు. అలా అని.. త‌న మాట‌ల‌తో విసుగు తెప్పించ‌రు కేసీఆర్‌. ఆయ‌న మాట‌లు.. రివ్యూ చేసే విధానం అధికారుల‌కు టైం తెలీకుండా పోతుంది. అప్పుడే తొమ్మిది గంట‌లు అయ్యిందా? అన్న భావ‌న క‌లిగేలా చేస్తాయ‌ని చెబుతుంటారు. తాజాగా నిర్వ‌హించిన మార‌థాన్ రివ్యూ మీటింగ్‌ ను చూస్తే.. ఒక్క విష‌యం చాలా స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. అదేమంటే.. రానున్న ఎన్నిక‌ల‌కు ప్ర‌భుత్వ యంత్రాంగం యావ‌త్తు చైత‌న్యంతో ప‌ని చేయ‌టం.. ప‌నుల వేగాన్ని మ‌రింత పెంచ‌టం.. ప్ర‌భుత్వ ఇమేజ్ అంత‌కంత‌కూ పెంచేలా వేగాన్ని పెంచుకోవాల‌న్న హిత‌బోధ‌తో పాటు.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల్ని స‌మ‌ర్థంగా అమ‌లు చేసే అంశంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపించాల‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి.

అంతేకాదు.. క‌లెక‌ర్ల అధికారానికి చెక్ పెట్టేలా రాజ‌కీయ జోక్యాన్ని అస్స‌లు స‌హించొద్ద‌ని.. ఇబ్బంది పెట్టే అధికార నేత‌ల విష‌యాలు ఏవైనా ఉంటే త‌న దృష్టికి తీసుకురావాల‌న్న‌ట్లుగా ఆయ‌న చేసిన దిశానిర్దేశం చూస్తే.. పాల‌న‌లో స్వేచ్ఛ‌ను ఇవ్వాల‌న్న విష‌యాన్ని ఆయ‌న చెప్పేశారు. త‌న‌కు ఫ‌లితం కావాల‌ని.. అందుకు అవ‌స‌ర‌మైన ప‌ని చేసే వాతావ‌ర‌ణాన్ని క‌ల్పిస్తాన‌న్న భ‌రోసాను తాను ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

వివిధ ప‌థ‌కాల గురించి క‌లెక్ట‌ర్ల అభిప్రాయాల్ని తెలుసుకోవ‌టంతో పాటు.. వాటి అమ‌లులో రాజ‌కీయ జోక్యాన్ని తాను స‌హించ‌న‌ని స్ప‌ష్టం చేయ‌టం ద్వారా.. సంక్షేమ ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు నేరుగా చేరువ కావాల‌న్నదే త‌న ఉద్దేశ‌మ‌న్న విష‌యాన్ని కేసీఆర్ త‌న మాట‌ల‌తో చెప్పేశార‌ని చెప్పాలి. త్వ‌ర‌లో తాను ప్ర‌క‌టించాల‌ని భావిస్తున్న ఒంట‌రి మ‌హిళ‌ల‌కు భృతి అంశానికి సంబంధించి ఫీడ్ బ్యాక్‌ను క‌లెక్ట‌ర్ల నుంచి అడిగి తెలుసుకోవ‌టం గ‌మ‌నార్హం.

ఇక‌.. తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ‌మైన జూన్ 2న కేసీఆర్ కిట్ల పంపిణీ ప‌థ‌కాన్ని స్టార్ట్ చేస్తున్న వేళ‌.. ఈ ప‌థ‌కంలో ప్ర‌భుత్వ ఇమేజ్‌ను మ‌రింత పెంచ‌టంతో పాటు.. త‌ల్లీబిడ్డా విష‌యంలో కేసీఆర్ స‌ర్కారు ఎంత ముందుచూపుతో ఉంద‌న్న విష‌యాన్ని మ‌రింత బాగా ప్ర‌చారం అయ్యేలా చేయాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది.

ప్ర‌స‌వం త‌ర్వాత అర్హులైన త‌ల్లుల‌కు అందించేఈ కిట్లను వీలైనంత‌వ‌ర‌కూ అంద‌రికి అంద‌జేయాల‌న్న విష‌యాన్ని కేసీఆర్ నొక్కి చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. అమ్మాయి పుడితే మ‌రో వెయ్యి అద‌నంగా ఇవ్వాల‌న్న మాట‌ను కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఏటా 6.5 ల‌క్ష‌ల ప్ర‌స‌వాలు జ‌రుగుతున్నాయ‌ని.. అందులో ఎక్కువ‌శాతం ఆసుప‌త్రుల్లో జ‌ర‌గాల‌ని.. అందుకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల అంశంపై దృష్టి సారించాల‌ని కేసీఆర్ చెప్పారు. ఒంట‌రి మ‌హిళ‌ల‌కు భృతి అందించే ప‌థ‌కాన్ని జూన్ 2 నుంచి స్టార్ట్ చేయ‌నున్న నేప‌థ్యంలో.. ఏడాది.. అంత‌కంటే ఎక్కువ ఏళ్ల నుంచి భ‌ర్త నుంచి దూర‌మైన మ‌హిళ‌ల్ని ఈ ప‌థ‌కం కింద తీసుకోవాల‌ని.. ఎంపికైన వారిని ఆధార్ ఆధారంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌న్న సూచ‌న చేశారు.

వీలైన‌న్ని అన్ని వ‌ర్గాల వారికి.. ప్ర‌భుత్వం చేప‌ట్టిన వివిధ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను ప్ర‌ద‌ర్శించ‌టం.. ద‌ళిత‌.. గిరిజ‌న వ‌ర్గాల కోసం ఖ‌ర్చు చేసే ప్ర‌తిపైసా స‌ద్వినియోగం కావాల‌ని.. వాటి విష‌యంలో ఎలాంటి లోటుపాట్లు దొర్ల‌కుండా చూసుకోవాల‌ని చెప్ప‌టం చూస్తే.. పాల‌నా ప‌రంగా అధికారుల మీద ఆధార‌ప‌డాల‌న్న విష‌యంపై కేసీఆర్ కున్న స్ప‌ష్ట‌త అర్థ‌మ‌వుతుంది. అదే స‌మ‌యంలో.. వారిపై ఒత్తిళ్లు తెచ్చే రాజ‌కీయ‌నాయ‌కుల మాట‌ల్ని వినాల్సిన అవ‌స‌రం లేద‌న్న భ‌రోసాను ఇవ్వ‌టం ద్వారా.. రానున్న రోజుల్లో పాల‌నా ర‌థాన్ని మ‌రింత వేగంగా తీసుకెళ్లే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News