పంచాంగం సైన్స్..తేల్చేసిన కేసీఆర్ కాద‌నేవారెవ‌రు?

Update: 2018-03-19 08:19 GMT
మిగిలిన ముఖ్య‌మంత్రుల‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు చాలా వ్య‌త్యాసాలు క‌నిపిస్తాయి. చాలామంది సీఎంలు తమ న‌మ్మ‌కాల్ని బ‌య‌ట‌పెట్టేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ఓపెన్ అయ్యేందుకు మ‌క్కువ ప్ర‌ద‌ర్శించ‌రు. చెప్పే విష‌యాన్ని మ‌రోలా అర్థం చేసుకుంటే లేనిపోని తిప్ప‌లు ఎదుర‌వుతాయ‌న్న భ‌యం వారిలో క‌నిపిస్తుంటుంది. శాస్త్రీయ‌త పేరుతో క‌మ్యూనిస్ట్ మేధావులు మొద‌లు.. నాస్తికులు చేసే ప్ర‌చారానికి భ‌య‌ప‌డి మ‌న‌కెందుకులే అన్న‌ట్లు దూరంగా ఉండే వారు చాలామంది క‌నిపిస్తారు.

కానీ.. కేసీఆర్ అలాంటోడు కాడు. తానేం చెప్పాల‌నుకుంటే దాన్నే చెప్పేశారు. ఎవ‌రో ఏదో అంటారని అస్స‌లు ప‌ట్టించుకోరు. ఒక‌వేళ‌.. ప‌ట్టించుకోవాల్సిన ప‌రిస్థితే సృష్టిస్తే.. దాన్ని చీపురుపుల్ల కంటే చిన్న‌గా చేసి చూపించి మ‌రీ తీసేయ‌ట‌మే కాదు.. త‌న మాట‌ల‌తో తిరిగి మాట్లాడ‌నీయకుండా ఎట‌కారం చేస్తారు. అప్ప‌టికి కుద‌ర‌క‌పోతే సెంటిమెంట్ తీసి భ‌య‌ప‌డేలా చేస్తారు.

అందుకే.. కేసీఆర్ ఏం మాట్లాడినా.. ఏం చేసినా మేధావుల సెక్ష‌న్ నుంచి పెద్ద‌గా విమ‌ర్శ‌లు బ‌య‌ట‌కు రావు. ఒక‌వేళ వ‌చ్చినా.. వాటిని ఎక్క‌డ క‌ట్ చేయాలో కేసీఆర్‌ కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో. ఈ మేనేజ్ మెంట్ పార్ట్ ను ప‌క్క‌న పెడితే.. పంచాంగం గురించి.. ఉగాది వేళ పంచాంగ శ్ర‌వ‌ణం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు కేసీఆర్‌. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో ఏళ్ల నుంచి పంచాంగ శ్ర‌వ‌ణం చేస్తున్నా.. ఏ సీఎం చేయ‌న‌న్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు తాజాగా చేశారు.

హేతువాదుల‌కు నిద్ర లేకుండా చేసిన ఆయ‌న వ్యాఖ్య‌లు చూస్తే..  పంచాంగం జాత‌కం చెప్ప‌టం లాంటిది కానే కాద‌ని తేల్చారు. పంచాంగం క‌చ్ఛితంగా సైన్సేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గ్ర‌హాల గ‌తి.. గ‌మ‌నం.. గ్ర‌హాణాల తీరు.. వాటి వ‌ల్ల వ‌చ్చే కాస్మిక్ ప్ర‌భావంపై క‌చ్ఛిత‌మైన స‌మాచారం ఉంటుంద‌న్నారు.

50 ఏళ్ల త‌ర్వాత వ‌చ్చే గ్ర‌హ‌ణాల ప‌ట్టు విడుపుల‌పై ఘ‌డియ‌.. విఘ‌డియ‌ల‌తో స‌హా క‌చ్ఛిత‌మైన స‌మ‌యాల‌ను పంచాంగం చెబుతుంది. టెలిస్కోప్ లాంటివేమీ లేని స‌మ‌యం నుంచి కూడా ఈ క‌చ్ఛిత‌త్వం వ‌చ్చేలా మ‌న‌కు అందించిన గొప్ప స‌నాత‌న ప‌ద్ద‌తిగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

పంచాంగం వేర్వేరుగా ప్ర‌వ‌చించినా.. మూల సిద్ధాంతం ఒక‌టేన‌ని ఆయ‌న చెప్పారు. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా చ‌మ‌త్కారంగా.. గంభీరంగా వ్య‌వ‌హ‌రించేలా చేసే హెచ్చ‌రిక‌గా పంచాంగాన్ని పండితులు అభివ‌ర్ణిస్తార‌న్నారు. మొత్తానికి కేసీఆర్ చెప్పిన పంచాంగ విశ్లేష‌ణ‌.. అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకోవ‌ట‌మే కాదు.. పంచాంగ ప్ర‌శ‌స్తిని కేసీఆర్ త‌న‌దైన శైలిలో చెప్ప‌టాన్ని ప‌లువురు అభినందిస్తున్నారు. ఇలాంటి అభినంద‌న‌లు ఎలా తెచ్చుకోవాలో తెలంగాణ ముఖ్య‌మంత్రికి తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీద‌నే చెప్పాలి.  
Tags:    

Similar News