గవర్నర్ తమిళిసైకి షాకిచ్చేలా కేసీఆర్ సర్కార్ సంచలన బిల్లు?

Update: 2022-12-03 10:44 GMT
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బిల్లులను ఆపేస్తూ వెనక్కి పంపేస్తూ సతాయిస్తున్న గవర్నర్ తమిళిసైకి షాకిచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. ఈ మేరకు ఆమె అధికారాల కత్తెరకు రెడీ అయ్యారు. ఇప్పటికే రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య ఉప్పు నిప్పులా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ నేరుగా విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు అలానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ లొల్లి తారాస్థాయికి చేరింది. తెలంగాణ ప్రభుత్వం తీరుపై పలుమార్లు కేంద్రం పెద్దలను సైతం గవర్నర్ కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ పరిణామాల క్రమంలోనే గవర్నర్ తమిళిసై ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇతర రాష్ట్రాల తరహాలోనే గవర్నర్ ను యూనివర్సిటీల ఛాన్సలర్ పదవి నుంచి తప్పించే యోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్టు సమాచారం.  

ఈ మేరకు త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. డిసెంబర్ 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ సమావేశాల్లోనే కేంద్రప్రభుత్వ తీరుతో పాటు గవర్నర్ వ్యవహారశైలిపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ సమావేశాల్లోనే గవర్నర్ ను వైస్ ఛాన్స్ లర్ పదవి నుంచి తప్పించే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని చూస్తున్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ సంతకం పెడితేనే ఆ బిల్లు  అమల్లోకి వస్తుంది. తనకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు.  కాకపోతే గవర్నర్ తీరును నిరసిస్తూ ఈ బిల్లు తేవాలని కేసీఆర్ సర్కార్ చూస్తోంది.

ఇప్పటికే బీజేపీ గవర్నర్ల వ్యవహారశైలితో కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు కూడా గవర్నర్లను విశ్వవిద్యాలయ చాన్సలర్ల పదవుల నుంచి గవర్నర్లను తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లులను తెచ్చాయి. కానీ అవి ఇప్పటివరకూ ఆమోదం పొందలేదు.

ఇప్పుడు తెలంగాణ గవర్నర్ పై దేశవ్యాప్తంగా చర్చ జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా బిల్లు తెచ్చే యోచనలో కనిపిస్తోంది. మరి దీనిపై ఎలాంటి వివాదం చెలరేగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News