మెట్రోకు కేసీఆర్ ‘డెడ్ లైన్’

Update: 2016-12-01 05:06 GMT
పేరు తెచ్చుకోవటానికి ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకబడుతున్నట్లుగా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం చూసినా ఎప్పుడో పూర్తి కావాల్సిన మెట్రో రైల్ ప్రాజెక్టుపై కేసీఆర్ శీతకన్ను వేశారన్న విమర్శ ఉంది.ఆయన కానీ ఉరుకులు.. పరుగులు కానీ పెట్టించి ఉంటే ఈపాటికి మెట్రో పట్టాల మీద పరుగులు తీసి ఉండేదని.. హైదరాబాదీయులకు ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడో తీరి ఉండేవని చెబుతారు.

సరైన కారణం లేకుండానే మెట్రో ప్రాజెక్టు మీద పెద్దగా ఆసక్తిని ప్రదర్శించని కేసీఆర్ తీరు కారణంగానే మెట్రో పట్టాల మీదకు ఎక్కలేదన్న ఆరోపణ ఉంది. నాగోల్ .. మెట్టుగూడ - మియాపూర్.. ఎస్ ఆర్ నగర్ మార్గం పూర్తైయి నెలలు గడుస్తున్నా.. ట్రయిల్ రన్ వందల సార్లు వేసినా.. అనుమతులు వచ్చేసినా.. జనానికి అందుబాటులోకి రాని వైనాన్ని పలువురు ప్రస్తావిస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఉన్నట్లుండి మెట్రో రైల్ మీద కేసీఆర్ దృష్టి పడింది.

తాజాగా ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించిన కేసీఆర్.. మెట్రో రైలుకు డెడ్ లైన్ ఇచ్చేశారు. హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా వ్యవహరించే మెట్రో రైల్ ను ఎట్టి పరిస్థితుల్లో 2018 ఆగస్టు నాటికి పూర్తి చేయాలంటూ డెడ్ లైన్ పెట్టేశారు. ఇప్పటివరకూ మెట్రో రైల్ పనులు 75 శాతం పూర్తి అయినట్లుగా చెప్పిన అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల్ని ఈ ప్రాజెక్టు కొంతమేర తీర్చగలదనీ.. పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.

ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు. ఎప్పుడూ లేనిది మెట్రోకు కేసీఆర్ డెడ్ లైన్ పెట్టటం ఏమిటి? 2014 ఎన్నికల ప్రచారంలో మెట్రో గురించి గొప్పలు చెప్పుకున్న ఆయన.. తాను అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత కూడా పూర్తి కాకుండా ఉన్న ఈ ప్రాజెక్టును సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందుగా పూర్తి చేసేలా చెబుతున్న వైనం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News