కేసీఆర్‌ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: బీజేపీ ఎంపీ హాట్‌ కామెంట్స్‌!

Update: 2023-01-04 10:14 GMT
టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మార్చి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానని చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు కేసీఆర్‌ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటయ్యాక ఆంధ్రా ప్రజలను అన్ని రకాలుగా దూషించిన కేసీఆర్‌ ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రాకు వస్తారని జీవీఎల్‌ నరసింహారావు నిలదీశారు. హైదరాబాద్‌ నుంచి ఏపీ ప్రజలను తరిమికొడతానని అన్నందుకు ముందు కేసీఆర్‌ ఆంధ్రా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ప్రజలే కేసీఆర్‌ని ఛీకొడుతూ తమ కొద్దని చెబుతున్నారని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు. అలాంటి కేసీఆర్‌ ఏపీ ప్రజలకి ఎందుకు? అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అవసరం ఏపీకి ఏమాత్రం అవసరం లేదన్నారు. ఆ పార్టీని అసలు ఏపీ ప్రజలు ఎందుకు సమర్థించాలని నిలదీశారు.

కరోనా సమయంలో ఏపీ నుంచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోవిడ్‌ రోగులు అంబులెన్సులలో హైదరాబాద్‌ వస్తుంటే వారిని తెలంగాణలో ప్రవేశించకుండా అడ్డుకున్నారని జీవీఎల్‌ గుర్తు చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేసింది కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రాలో వ్యవసాయానికి ఉపయోగపడవలసిన నీటితో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని వృథాగా సముద్రంలోకి పోయేలా చేస్తోంది కూడా కేసీఆరేనని జీవీఎల్‌ నరసింహారావు ధ్వజమెత్తారు.

అదేవిధంగా ఏపీలో సాగునీటి ప్రాజెక్టులను కట్టుకోనీయకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారని కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ ఏపీలో బీఆర్‌ఎస్‌ ని గెలిపిస్తే ఏపీని సస్యశ్యామలం చేస్తామని చెప్పడాన్ని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు. అలాగే రైతు బంధు ఇస్తామని మాయామాటలు చెబుతున్నారని మండిపడ్డారు.

ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలు చెల్లించకుండా కేసీఆర్‌ ఇబ్బంది పెడుతున్నారని జీవీఎల్‌ గుర్తు చేశారు. ఏపీకి రావాల్సిన నీళ్ళు, ఆస్తులు పంచకుండా అడ్డుపడుతూ మళ్ళీ ఏపీలో పోటీ చేస్తామనడంపై ధ్వజమెత్తారు. తమ పార్టీకే ఓట్లేయమని ఏపీ ప్రజలను ఏ విధంగా అడుగుతారని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ ఏపీలో అడుగుపెడితే తగిన విధంగా ఏపీ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రెస్‌ పార్టీని నామరూపాలు లేకుండా చేసిన ఆంధ్రా ప్రజలు, దానికి కారకుడైన కేసీఆర్‌ వస్తే ఎర్ర తివాచీతో స్వాగతం పలుకుతారనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News