ఎమ్మెల్యేల‌కు ఎర విష‌యంపై కేసీఆర్ సైలెంట్ అందుకే!

Update: 2022-10-29 10:37 GMT
టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలను న‌లుగురిని ఒక్కొక్క‌రికి రూ.100 కోట్ల చొప్పున ఇచ్చి కొనుగోలుకు ప్ర‌య‌త్నించార‌నే కేసు దేశాన్ని కుదిపేసిన విష‌యం తెలిసిందే. రాత్రి కి రాత్రి దావాల‌నంలా జాతీయ‌స్థాయి మీడియాకు సైతం పాకిన ఈ విష‌యం తెలంగాణ‌లోనే కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ ప‌తాక శీర్షికగా మారింది. రాజ‌కీయ పెనుదుమారానికి కూడా కేంద్రంగా మారింది. ఈ విష‌యంలో బీజేపీ హ‌స్తం ఉంద‌ని.. కేంద్రంలోని పెద్ద‌ల ప్రోత్సాహం ఉందని అధికార టీఆర్ ఎస్ పార్టీ విమ‌ర్శ‌లు గుప్పించ‌గా.. కాదు, ఇదంతా మునుగోడు కోసం మీరు ఆడుతున్న నాట‌కం అని బీజేపీ నేత‌లు విమ‌ర్శంచారు.

మ‌రోవైపు, న‌లుగురు ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ భ‌వ‌న్‌కు వెళ్ల‌డం, అక్క‌డ సీఎంతో భేటీ కావ‌డం త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు వంటివి మ‌రింత కాక పుట్టించాయి. ఇక‌, దీనికి అస‌లు బీజం ఎక్క‌డ ప‌డింది?  ఎవ‌రు ఎవ‌రిని కెలికారు?  ఎందుకు ఇదంతా చేశారు? అనే విష‌యాలు.. ఆడియోల రూపంలో వెలుగు  చూసి మ‌రింత సంచ‌ల‌నం సృష్టించారు. అయితే,త‌న ప్ర‌భుత్వంపై చీమ చిటుక్కుమ‌న్నా వెంట‌నే రియాక్ట్ అయ్యే సీఎం కేసీఆర్ ఈ విష‌యంపై మాత్రం రియాక్ట్ కాలేదు. నిజానికి ఈ ఘ‌ట‌న వెలుగు చూసిన మ‌రునాడే ఆయ‌న ప్రెస్ మీట్ పెడ‌తార‌ని(గురువారం) అనుకున్నారు.

కానీ, ఆయ‌న ఢిల్లీ వెళ్తున్నార‌ని, అక్క‌డ మీడియాతో మాట్లాడి, బీజేపీ పరువును దేశ రాజ‌ధాని కేంద్రంగా తీసేస్తార‌ని టీఆర్ ఎస్ నాయ‌కులు క్లూ ఇచ్చారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎలాంటిచ‌డీచ‌ప్పుడు లేకుండా కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఇలా, ఆయ‌న ఎందుకు మౌనంగా ఉన్నార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల‌ప్ర‌శ్న‌గా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. "కేసీఆర్‌ ఏం మాట్లాడినా వక్రీకరిస్తారు. అందుకే మౌనంగా ఉన్నారు" అని చెప్పారు.

అంతేకాదు, చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సందర్భానుసారంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, దర్యాప్తు సంస్థలు వివరాలు వెల్లడిస్తాయని కేటీఆర్ తెలిపారు. "దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మేం మాట్లాడబోయేది లేదు. తొందరపడొద్దని మా పార్టీ శ్రేణులకు ఇప్పటికే సూచించాను. సమయం వచ్చినప్పుడు సీఎం అన్ని వివరాలు వెల్లడిస్తారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే పోలీసులెందుకు? దొంగ ఎవరో.. దొర ఎవరో ప్రజలకు ఇప్పటికే అర్థమైంది’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News