అవ‌మానాల‌ను అదృష్టాలు గా మార్చుకున్న కేసీఆర్

Update: 2018-12-13 07:58 GMT
తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్‌) ఆవిర్భావ‌మే ఓ సంచ‌ల‌నం. త‌మ‌ పై ప‌రాయి వ్య‌క్తుల పెత్త‌నాన్ని అంగీక‌రించ‌బోమ‌ని ఉద్ఘాటిస్తూ.. స్వ‌రాష్ట్ర సాధ‌న కోసం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు ఆ పార్టీని స్థాపించారు. దీర్ఘ‌కాలిక ల‌క్ష్యం తెలంగాణ సాధ‌నే అయిన‌ప్ప‌టికీ.. పార్టీ స్థాప‌న వెనుక త‌క్ష‌ణ కార‌ణం కేసీఆర్ కు చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డ‌మే అని చెబుతుంటారు రాజ‌కీయ విశ్లేష‌కులు. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా చంద్ర‌బాబు చేసిన అవ‌మాన భారంతోనే ఆయ‌న పార్టీ పెట్టార‌ని అంటుంటారు.

తాజాగా కేసీఆర్ గురించి మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. బుధ‌వారం మీడియాతో ఇష్టాగోష్ఠి లో స్వ‌యంగా కేసీఆరే ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. టీఆర్ఎస్‌ ను కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు తాను ఎప్పుడో సిద్ధ‌మ‌య్యాన‌ని.. అప్ప‌టి కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ముందుకు ఆ ప్ర‌తిపాద‌న తీసుకెళ్లాన‌ని చెప్పారు. విలీనం అనంత‌రం తెలంగాణ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని త‌న‌కు ఇవ్వాల‌ని ష‌ర‌తు పెట్టిన‌ట్లు కూడా చెప్పారు. అందుకు సోనియా అంగీక‌రించ‌క‌పోవ‌డంతో విలీనం సాకారం కాలేద‌ని వెల్ల‌డించారు. టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి నిరాక‌రించ‌డం ద్వారా కేసీఆర్ ను సోనియా అవ‌మానించార‌న్న‌మాట‌!

కొన్నేళ్లు గ‌డిచాయి. ప‌రిస్థితులు మారాయి. తెలంగాణ సిద్ధించింది. రాష్ట్రంలో గులాబీ జెండా రెపరెప‌లాడింది. తెలంగాణ‌ లో తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసింది. మ‌ళ్లీ ఎన్నిక‌లొచ్చాయి. ఈ ద‌ఫా కాంగ్రెస్ - టీడీపీ ఒక్క‌ట‌య్యాయి. కేసీఆర్ ను గ‌ద్దె దించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేశాయి. వారి ప్ర‌య‌త్నాలు - ప్ర‌ణాళిక‌ల‌న్నింటినీ కేసీఆర్ చిత్తుచేశారు. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా చంద్ర‌బాబు అవ‌మానించ‌డంతో కేసీఆర్ పార్టీ పెట్టారు.

టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చేందుకు నిరాక‌రించి సోనియా అవ‌మానించ‌డంతో ఏకంగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నే ఆయ‌న సొంతం చేసుకున్నారు. ఈ ప‌రిణామాల‌ను రాజ‌కీయ నిపుణులు విశ్లేషిస్తూ.. అవ‌మానాల‌ను అదృష్టాలుగా మార్చుకుంటూ కేసీఆర్ ఎదిగార‌ని కొనియాడుతున్నారు. అవ‌మానాల‌కు కుంగిపోకుండా చెక్కుచెద‌ర‌ని ఆత్మ‌విశ్వాసంతో ఆయ‌న చూపిన ప‌ట్టుద‌ల‌, నిరంత‌ర కృషి కార‌ణంగానే కేసీఆర్ ఇంత‌టి విజ‌యం సాధించారంటూ ప్ర‌శంసిస్తున్నారు.
Tags:    

Similar News