మోడీ టైమ్ కన్ఫర్మ్ కాకుండానే ఢిల్లీకి వెళ్లటం ఎందుకు?

Update: 2021-11-21 05:41 GMT
ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకోవటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్తేం కాదు. తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఆ కోవకు చెందినదే. శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. అప్పటికప్పుడు తన భవిష్యత్ కార్యాచరణను.. ఢిల్లీ టూర్ ను ప్రకటించటమే కాదు.. కేంద్రంలోని మోడీ సర్కారుకు షాకులు ఇచ్చే ప్రకటనలు ఆయన నోటి నుంచి వెలువడ్డాయి.

అందులో కీలకమైనది రైతు చట్టాల రద్దు కోసం ఉద్యమించి.. అందులో మరణించిన కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున తెలంగాణ సాయం అందిస్తుందన్నది ఒకటైతే.. తాను.. తన మంత్రులు..ఎంపీలు కలిసి ఢిల్లీకి వెళుతున్నామని చెప్పారు.

ఊరకే రారు మహానుభావులు అన్న చందంగా.. అరుదుగా మాత్రమే ఢిల్లీకి వెళ్లే సీఎం కేసీఆర్.. తాజాగా మాత్రం అంత హడావుడిగా ఎందుకు వెళుతున్నట్లు? అన్న ప్రశ్నకు ఆయనే సమాధానం ఇచ్చేశారు. తెలంగాణ నుంచి వార్షిక ధాన్యం సేకరణ లక్ష్యం ఎంతన్నది చెప్పాలని కేంద్రాన్ని అడిగితే చెప్పటం లేదని.. అందుకే చివరి ప్రయత్నంగా ఆదివారం తాను ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారు.

తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీని.. కేంద్రమంత్రుల్ని కలవటమే తన లక్ష్యమని చెప్పారు. రెండు.. మూడు రోజులు ఢిల్లీలోనే ఉండి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. కేంద్రం ఉప్పుడు బియ్యం కొనేది లేదని చెప్పినట్లుగా గాలి వార్త వచ్చిందని.. అది అధికారికమా లేదా? అనే విషయాన్ని తేల్చుకుంటామన్నారు.

ఉప్పుడు బియ్యం కొనే పరిస్థితే లేదని.. ఇప్పటికే కేంద్రం తనకు చెప్పిందని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు దాన్ని గాలి వార్తగా తేల్చి.. దానిలో నిజం ఎంతన్న విషయాన్ని తేల్చేందుకు తానే స్వయంగా వెళుతున్నట్లుగా చెప్పిన మాట వింటే.. ఈ మాత్రం దానికి ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు వెళితే సరిపోతుంది కదా? అన్న సందేహం కలుగక మానదు.

అంతేకాదు.. ప్రధాని మోడీతో భేటీ కావాలంటే ఆయన అపాయింట్ మెంట్ చాలా అవసరం. నిజానికి గతంలో ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నప్పటికీ.. ప్రధాని నుంచి టైం అన్నది తేలకుండా ఉన్న సమయంలో.. ఆయన తన ఢిల్లీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవటం తెలిసిందే. అలాంటి కేసీఆర్.. ముందస్తుగా ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండానే ఢిల్లీకి టూర్ పెట్టుకున్న వైనం అండర్ లైన్ చేసుకోవాలనిపించక మానదు.

లోతుగా వెళితే.. ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఆయన చెప్పిన కారణం అతికినట్లే కనిపించినా.. అసలు విషయం మాత్రం మరోలా ఉందంటున్నారు. కేసీఆర్ సతీమణి శోభమ్మ శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లటం తెలిసిందే. కరోనా అనంతర సమస్యల్ని ఆమె ఎదుర్కోవటం.. ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షల కోసం కొడుకు కేటీఆర్ తో కలిసి వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోనే ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తన సతీమణి ఆరోగ్య అంశాల మీద ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడటానికి వీలుగా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం కేసీఆర్ కు ఉంది. ఆ టూర్ కు కాసింత పొలిటికల్ కలర్ ఇచ్చే ప్రయత్నంలో చేసిన ఆలోచనే.. ప్రధాని మోడీతో భేటీగా చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన తర్వాత ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ దొరక్కుంటే.. రైతుల సమస్యల మీద.. రాష్ట్ర రైతులకు సంబంధించిన అంశం మీద మాట్లాడటానికి వెళితే.. టైం కూడా ఇవ్వలేదన్న మాటకు దక్కే మైలేజీ ఎంతో తెలిసిందే.

ఒకవేళ.. కేసీఆర్ ప్లానింగ్ అర్థమై ప్రధాని మోడీ టైమిస్తే.. దాన్ని తన విజయంగా అభివర్ణించుకునే నేర్పు గులాబీ బాస్ లో ఎంతన్నది తెలిసిందే. ఇలా ఎటు చూసినా తనకే ప్రయోజనం దక్కే వీలుండటంతో ప్రధాని అపాయింట్ మెంట్ కన్ఫర్మ్ కాక ముందే ఢిల్లీ టూర్ కు కేసీఆర్ తెర తీశారని చెప్పారన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News