కొడుక్కి పగ్గాలు.. మేనల్లుడికి పొగడ్తలు

Update: 2016-01-13 04:52 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మక వైఖరికి అందరికి సుపరిచితమే. అన్ని విషయాల్లో మాదిరే.. వ్యక్తిగత అంశాల విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరి చూసిన వారు విస్మయం చెందే పరిస్థితి. కొడుకు.. మేనల్లుడు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ విషయంలో పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నప్పటికీ.. హద్దులు దాటకుండా ఉండేలా కంట్రోల్ చేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా.

తన రాజకీయ వారసుడిగా కొడుకును.. అతని వారసుడిగా మనమడ్ని డిసైడ్ చేసిన కేసీఆర్.. ఎప్పుడేం జరగాలన్న విషయంలో చాలా స్పష్టతతో ఉన్నారని చెప్పొచ్చు. తన చేష్టలతో దూసుకెళ్లే మేనల్లుడి స్పీడ్ కు వ్యూహాత్మక చెక్ చెబుతూ.. కొడుకును ప్రమోట్ చేసే పద్ధతి చూస్తే అబ్బురమనిపించక మానదు. అన్నీ తాను కోరుకునేటట్లు జరిగేలా ఆయన జాగ్రత్త పడిన తీరు.. చాలామందికి పాఠాలనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

వరంగల్ ఉప ఎన్నిక కావొచ్చు.. గ్రేటర్ ఎన్నికలు కావొచ్చు.. పాలనా పరమైన అంశాల విషయంలో కొడుకు కేటీఆర్ ఇచ్చే స్వేచ్ఛ ఎంతో అందరికి తెలిసిందే. అదే సమయంలో మేనల్లుడు హరీష్ సమర్థతపై కూడా అవగాహన ఉంది. అందుకే.. ఇద్దరి మధ్య సమన్వయం కుదర్చలేకపోయినా.. అసంతృప్తిలోనూ హద్దులు దాటని సంయమనంతో వ్యవహరించేలా చేయటంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. గ్రేటర్ ఎన్నికల బాధ్యత మొత్తం కేటీఆర్ చేతుల్లో పెట్టేసి.. ఆయన్నో శక్తిగా మారుస్తున్న కేసీఆర్.. మేనల్లుడు చిన్నబుచ్చుకోకుండా ఉండేందుకు ఆయన నలుగురిలో పొగిడే కార్యక్రమాన్ని షురూ చేశారు.

కొడుకును విపరీతంగా ప్రమోట్ చేసే ప్రతి సందర్భంలోనూ మేనల్లుడ్ని పొగడ్తలతో ముంచెత్తే ధోరణి కేసీఆర్ కు కొత్తేం కాదు. కానీ.. అలాంటిదేమీ ప్రత్యేకంగా కనిపించకుండా జాగ్రత్త పడటంలో ఆయన ప్రదర్శించే చాణుక్యం చూస్తే మాత్రం కేసీఆర్ మైండ్ గేమ్ కి ఫిదా కావాల్సిందే.
Tags:    

Similar News