మోడీకి కేసీఆర్ ఇచ్చే సూచనలు ఇవే..

Update: 2016-11-19 04:32 GMT
అవకాశం వచ్చినప్పుడే తనను తానేంటో నిరూపించుకునేటోడే మొనగాడు. మేధావినన్న ట్యాగ్ కట్టుకొని తిరగనక్కర్లేదు.. సమయం.. సందర్భం చూసుకొని చెప్పుకోవటంలోనే అంతా ఉందన్న విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నోట్ల రద్దు అంశంపై మరే రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత కసరత్తును.. సుదీర్ఘ చర్చను జరిపిన కేసీఆర్.. చివరకు ఈ అంశంపై కేంద్రం ఏం చేస్తే బాగుంటుందన్న నివేదికను సిద్దం చేశారు. ఓపక్క నోట్ల రద్దుపై మిత్రపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం అసంతృప్తితో ఉన్న వేళ.. ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యం లేని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రద్దుపై తయారు చేసిన రిపోర్ట్ ను చూసేందుకు.. కేసీఆర్ తో మాట్లాడేందుకు  ప్రధాని ఎంత ఆత్రుతగా ఉన్నారన్నది.. ఆయన టైమిచ్చిన వైనాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ఓపక్క పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా.. దానికి హాజరు కాకుండా వరుస సమావేశాల్లో బిజీబిజీగా ఉంటున్న ప్రధాని.. అందుకు భిన్నంగా కేసీఆర్ కు మాత్రం వెనువెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వటమే కాదు.. రద్దుపై ఆయన చెప్పిన మాటల్ని ఫోన్లో విన్నప్రధాని.. మీరు పూర్తి నివేదిక తీసుకొని రండి అంటూ ఆహ్వానించటం మర్చిపోకూడదు.

ప్రధానిగా ఉన్న మోడీ లాంటి వ్యక్తి .. తాను తీసుకున్న సంచలన నిర్ణయానికి సంబంధించిన డీటైయిల్డ్ రిపోర్ట్ ను తీసుకురావాలని చెప్పిన వేళ.. మేథోమధనం చేసిన కేసీఆర్ భారీ సూచనలే చేసేందుకు సిద్ధమైనట్లుగా చెప్పాలి. ప్రధాని మోడీకి తాను ఎలాంటి సలహాలు.. సూచనలు చేయనున్న విషయాన్ని తనదైన శైలిలో మీడియాకు అందేలా చేశారు. ప్రధానిని కలవకముందే.. ఆయన్నుకలిసి చెప్పాలనుకున్న సూచనలు ఆయనకంటే ముందుగా ప్రజలకు తెలిసి పోవటం గమనార్హం. ఇక.. ప్రధానికి కేసీఆర్ చేయనున్న సూచనలు చూస్తే..

= వారానికి నిర్ణీత నిధులు (ప్రస్తుతం వారానికి రూ.24వేలు) డ్రా చేసుకోవాలనే నిబంధనను తొలగించండి.

= రూ.500నోట్లు మార్కెట్లోకి రాకుండా రూ.2వేల నోటుతో ఉపయోగం లేదు. తగినన్ని రూ.500నోట్లు విడుదల చేయండి.

=బ్యాంకుల నుంచి విత్ డ్రా లిమిట్ ను రూ.50వేలకు పెంచండి. పోస్టల్ నెట్ వర్క్ తో ఆశించినంత స్థాయిలో నగదు మార్కెల్లోకి వెళ్లదు.

= మైక్రో ఏటీఎంల సంఖ్యను పెంచండి.

= అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో రిజిష్టర్ అయిన డీలర్లకు రూ.50వేల దాకా నగదు తీసుకునే సౌకర్యం కల్పించాలి.

= కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు జీతాల్లో కొంతభాగాన్ని నగదురూపంలో ఇవ్వాలి.

= రూ.10లక్షలపైనే ఆదాయం సంపాదించే వారి నుంచి 30శాతంఆదాయపన్ను వసూలుచేస్తున్నారు. దాన్ని 20 శాతానికి కుదించాలి.

= పన్ను పడని ఆదాయ పరిమితిని రూ.2.5లక్షల కన్నా పెంచాలి.

= నోట్ల రద్దు నేపథ్యంలో ఆన్ లైన్.. చెక్కుల ద్వారా లావాదేవీలు ఎక్కువగా జరిగే వీలున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల సంఖ్య పెంచాలి.

 = నోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం బాగా దెబ్బ తింది. నిర్మాణ రంగంపై ప్రభావం పడింది. దీనిపై ఆధారపడినోళ్లకు ఉపాధి చర్యలు చేపట్టాలి.

=  చిన్న వ్యాపారులు రూ.2.5లక్షల కంటే ఎక్కువగా జమ చేసుకునే వీలు కల్పించాలి. ఉద్దేశ్యపూర్వకంగా తప్పులు చేసే వారినిశిక్షించాలి. తప్పుడు ఉద్దేశాలు లేకుండా ఇంతకాలంగా సాగుతున్న పద్ధతినే ఇళ్లల్లో డబ్బులు దాచుకునే సామాన్యుల్ని ఇబ్బంది పెట్టొద్దు.

= వ్యవసాయ ఆదాయానికి పన్ను లేదని స్పష్టంగా ప్రకటించినా.. బ్యాంకు ఖాతాలు తెరిచి వ్యవసాయ ఆదాయాన్ని జమ చేస్తే ఫన్ను ఉండదని ప్రచారం చేయాలి.

= ఖరీఫ్ పంట మార్కెట్లోకి చేరిన నేపథ్యంలో రైతులకు రూ.లక్ష వరకూ నగదు తీసుకునే వీలు కల్పించాలి. వ్యవసాయ లావాదేవీలకు నగదునే వాడతారు. వీరి వద్ద ఎలాంటి రశీదులు ఉండవు. కాబట్టి వీరంతా నష్టపోకుండా ఆ నిధులను బ్యాంకుల్లో జమ చేసుకునే వీలు కల్పించాలి. ఇందుకోసం ప్రత్యేక విధివిధానాల్ని తయారు చేయాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News