అదిరేలా కేసీఆర్.. ఆప‌రేష‌న్ మ‌టాష్‌!

Update: 2018-12-23 05:19 GMT
సంతృప్తి ప‌డ‌టం అంటే రాజీ ప‌డ‌ట‌మేనని కొంద‌రు వాదిస్తుంటారు. ఆ వాద‌న‌తో ఏకీభ‌విస్తారా? అని అడ‌గొచ్చు. కానీ.. ఆయా వ్య‌క్తుల దృష్టి కోణంలో నుంచి చూస్తే..  వారి వాద‌న నిజ‌మే క‌దా? అనిపించిక మాన‌దు. ఇదంతా ఎందుకంటారా?  తెలంగాణ అధికార‌ప‌క్ష అధినేత కేసీఆర్ వ్యూహ‌ర‌చ‌నపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. 119 మంది స‌భ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో త‌మ పార్టీ అభ్య‌ర్థుల్లో 88 మందిని సొంతంగా గెలిపించుకున్న స‌త్తా కేసీఆర్ సొంతం. తెలంగాణ రాష్ట్రంలో ఆయ‌న బ‌లం ఎంత‌న్న‌ది ఈ అంకె ఇట్టే చెప్పేస్తుంది.

ఎమ్మెల్యే అభ్య‌ర్థులుగా బ‌రిలో నిలిపిన వారిపై వ్య‌తిరేక‌త ఉన్నా.. వారిని చూడొద్దు.. న‌న్ను చూసి ఓటేయండ‌న్న మాట‌ను చెప్ప‌ట‌మే కాదు.. తెలంగాణ ప్ర‌జ‌లు స‌మాధాన‌ప‌డేలా చేయ‌టం ద్వారా.. తెలంగాణ రాష్ట్రంలో త‌న‌కున్న ప‌ట్టును చెప్పేశారు కేసీఆర్‌. మ‌రింత సాధించిన ఆయ‌న.. తన‌ను వ‌రించిన విజ‌యాన్ని చూసుకొని సంతృప్తి చెందుతున్నారా? అంటే లేద‌ని చెప్పాలి. అలా సంతృప్తి చెందితే ఆయ‌న కేసీఆర్ ఎందుకు అవుతారు చెప్పండి.

కేసీఆర్ తాజా వ్యూహం అదిరిపోయేలా ఉండ‌ట‌మే కాదు.. విప‌క్షాల‌కు వ‌ణుకు పుట్టించేలా మారింది. తాను.. త‌న‌కు న‌చ్చిన వారు మాత్ర‌మే తెలంగాణ అసెంబ్లీలో ఉండాల‌న్న‌ట్లుగా కేసీఆర్ తీరు ఉంద‌న్న మాట ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

తెలంగాణ  ప్ర‌జ‌లు ఇచ్చిన తాజా తీర్పు నేప‌థ్యంలో కేసీఆర్ ఆలోచ‌న‌లు అలా సాగ‌టంలో త‌ప్పేం లేదు. అందులోకి మ‌రో నాలుగైదు నెలల్లో కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రగ‌నున్న నేప‌థ్యంలో.. త‌న బ‌లం ఏమిటో..?  త‌న స‌త్తా ఎంతన్న విష‌యాన్ని జాతీయ స్థాయిలో చూపించుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్ అందుకు త‌గ్గ‌ట్లు పావులు క‌దుపుతున్నారు.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డై దాదాపు రెండు వారాలు గ‌డుస్తున్నా.. ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకారాన్ని అట్టే పెట్టేసిన ఆయ‌న‌.. వారి ప్ర‌మాణ‌స్వీకారం చేసే లోపు స‌రి చేయాల్సిన లెక్క‌ల మీద దృష్టి సారించిన‌ట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యేలుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసే దాని కంటే ముందే.. విప‌క్షాల ఉనికి ప్ర‌శ్నార్థ‌క‌మ‌య్యేలా పావులు క‌దుపుతున్నారు కేసీఆర్‌. తెలంగాణ అసెంబ్లీలో విప‌క్షాల ఉనికే లేన‌ట్లుగా చేయాల‌న్న కేసీఆర్ ఆలోచ‌న వెనుక అస‌లు లెక్క వేరే ఉంద‌ని చెబుతున్నారు.

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ స‌భా స్థానాల్లో ఒక్క‌టి మిత్ర‌ప‌క్ష‌మైన మ‌జ్లిస్ కు ఇచ్చేసి.. మిగిలిన 16 ఎంపీలను టీఆర్ ఎస్ ఖాతాలో వేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో జాతీయ రాజ‌కీయాల్లో త‌న స‌త్తా చాటాల‌ని భావిస్తున్న కేసీఆర్‌.. అందుకు త‌గ్గ‌ట్లు తెలంగాణ‌లో త‌న‌ను క్వ‌శ్చ‌న్ చేసే స్థాయిలో విప‌క్షాలు ఉండ‌కూద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందుకోసమే విప‌క్షాలు మ‌టాష్ అయ్యేలా ఆయ‌న ప్లాన్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌మాణ‌స్వీకారం చేసే నాటికే విప‌క్ష ఎమ్మెల్యేలు గులాబీ కారు ఎక్కేయ‌టం ద్వారా.. కొత్త త‌ర‌హా రాజ‌కీయాల‌కు కేసీఆర్ తెర తీసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News