కాంగ్రెస్‌ కు భయపడే కేసీఆర్ కేసులు తవ్వుతున్నారా?

Update: 2018-09-12 17:27 GMT
ముందస్తుగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదని టీఆర్ ఎస్ పార్టీకి అర్థమైనట్లుంది.. అందుకే గులాబీ బాస్ పాత కేసులను తవ్వి తీసి కాంగ్రెస్ నేతలను భయపెట్టే పనిలో పడినట్లుగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు వరుసగా టార్గెట్ అవుతుండడమే దీనికి ఉదాహరణ.  14 ఏళ్ల కిందటి మానవ అక్రమ రవాణా కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేసి 24 గంటలు గ‌డ‌వ‌కముందే  మరో కాంగ్రెస్ నేతపై కేసు న‌మోదైంది. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డిపైనా కేసులు నమోదయ్యాకి. గండ్ర సోదరులు  తుపాకీతో  త‌న‌ను బెదిరించార‌ని క్ర‌ష‌ర్ వ్యాపారి ఎర్రబెల్లి రవీందర్ రావు శాయంపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఆయన ఫిర్యాదు మేరకు శాయంపేట పోలీసులు 5 సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. క్ర‌ష‌ర్ విష‌యంలో త‌లెత్తిన వివాదంలో త‌న‌ను బెదిరించార‌ని… వెంక‌ట ర‌మ‌ణారెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడు భూపాల్‌ రెడ్డి వల్ల త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ర‌వీంద‌ర్‌ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గండ్ర వెంక‌ర‌మ‌ణారెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడిని కూడా అరెస్టు చేస్తార‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి.
   
24 గంటల వ్యవధిలోనే ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలపై కేసులు న‌మోదవ‌డం సంచ‌ల‌నంగా మారింది. జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి భూపాల‌ప‌ల్లి నుంచి పోటీ చేయ‌బోతున్నారు. ఈరెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని వార్త‌లు విన్పిస్తున్నాయి. దీంతో వీరిని దెబ్బ‌కొట్టేందుకు టీఆర్ ఎస్ ఈ ఎత్తుగ‌డ వేసిన‌ట్లు విమర్శలొస్తున్నాయి.
   
వీరిద్దరు తరువాత బుధవారం అసలు రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ తురుపుముక్క రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చినవారికి అక్రమంగా ప్లాట్లు కేటాయించారంటూ ఆయనకు నోటీసులిచ్చారు పోలీసులు. దీంతో రేపోమాపో ఆయన్నూ అరెస్టు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News