కేసీఆర్ అలా.. మాతంగి ఇలా.. వ‌ర్షాలు ఆగ‌వు ఎలా?

Update: 2022-07-18 09:30 GMT
తెలంగాణ‌లో వ‌ర్షాల‌పై సీఎం కేసీఆర్ క్లౌడ్ బ‌రస్ట్ కుట్ర అన్నారు. ఇది విదేశాలు చేస్తున్న‌ట్టు త‌న ద‌గ్గర స‌మాచారం ఉంద‌న్నారు. దీనిపై ఇంకా చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతూనే ఉన్నాయి. ఇంత‌లో సికింద్రాబాద్ ఉజ్జ‌యినీ మాతంగి.. మ‌రో విష‌యం చెప్పింది. త‌నకు ప్రజలు పూజలు సరిగ్గా చేయడం లేదన్న కోపంతో భారీవర్షాలు కురిపిస్తున్నట్లు.. పేర్కొంది.

ఆగ్రహం తట్టుకోలేరనే కోపాన్ని గోరంతే చూపుతున్నానని... రంగం కార్యక్రమంలో మాతంగి వివరించింది. తన రూపాన్ని స్థిరంగా నిలపాలని కోరిన అమ్మవారు... విగ్రహ ప్రతిష్ఠ ప్రక్రియ ఏడాదిలోపు పూర్తి చేయాలని పేర్కొంది.  

సికింద్రాబాద్‌ బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. వేడుకల్లో ప్రధాన కార్యక్రమైన రంగం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. అవివాహిత అయిన జోగిని శరీరంపై ఆవహించి... అమ్మవారు భవిష్యవాణి పలికారు. ప్రజలు మొక్కుబడిగా పూజలు చేస్తున్నారన్న అమ్మవారు.. అయినా తన బిడ్డలే కదా అని భరిస్తున్నానని తెలిపింది. గుడిలో పూజలు సరిగా జరిపించట్లేదన్న అమ్మవారు.. గర్భాలయంలో శాస్త్రబద్ధంగా, భక్తిశ్రద్ధలతో జరిపించమని సూచించింది.

సంతోషంగా పూజలు అందుకోవాలని అనుకుంటున్నానని తెలిపిన ఆమె... స్థిరమైన రూపంలో కొలువుదీరాలని అనుకుంటున్నానని పేర్కొంది. తన రూపాన్ని స్థిరంగా నిలపాలని కోరిన మాతంగి.. దొంగలు దోచినట్టుగా నా నుంచే మీరు కాజేస్తున్నారని తెలిపింది. ప్రజల కళ్లు తెరిపించడానికే ఆగ్రహంతో వర్షాలు కురిపిస్తున్నానని పేర్కొంది. ఐనా మీరెన్ని తప్పులు చేసినా నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నానని అమ్మవారు పునరుద్ఘాటించింది.

భవిష్యవాణి అనంతరం అమ్మవారి... అంబారి ఊరేగింపు వైభవంగా సాగింది. అంబారి ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపు వైభవంగా సాగనుంది.

నగరంలోని దాదాపు 40కిపైగా ప్రాంతాల నుంచి ఫలహారం బండ్లు వస్తాయని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభయమ్యే వేడుక వేడుక అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. ఫలహారం బండ్ల ఊరేగింపుతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పూర్తి కానుంది.
Tags:    

Similar News