వారంలో ఎట్లా?లేడికి లేచిందే పరుగంటే ఎలా?

Update: 2015-07-24 04:01 GMT
మీరో ఇంట్లో ఉన్నారు. దాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎన్ని రోజుల్లో ఖాళీ చేస్తారు? ఖాళీ చేసేందుకు ఎంత సమయం పడుతుంది? తక్కువలో తక్కువ నెల రోజులైనా అవసరం అవుతుంది? ఇప్పటికే ఉన్న ఇంటికి సంబంధించి అనుకూలంగా ఉండే వాటికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఎన్నో ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉంటుంది? పిల్లల స్కూళ్లు దగ్గర నుంచి.. ఇప్పుడున్న వసతులు తగ్గకుండా ఉండేలా చూసుకోవటం లాంటివెన్నో ఉంటాయి.

ఒక వ్యక్తికి సంబంధించిన ఇంటికే ఇన్ని సమస్యలు ఉంటే.. పురాతనమైన ఒక పెద్దాసుపత్రిని మార్చటం ఎంత కష్టం..? లేడికి లేచిందే పరుగంటే సాధ్యమేనా? కష్టనష్టాలు చూసుకోవటం? ఎదురయ్యే సమస్యలపై పక్కా ఏర్పాట్లు చేయటం లాంటివి ఏమీ అక్కర్లేదా? లాంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తుతాయి. ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని తక్షణం ఖాళీ చేయాలని.. వారం రోజుల్లో దాన్ని వేరే చోటకు తరలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు.

ఉస్మానియా ఆసుపత్రి భవనం పెచ్చులూడిపపోవటం.. చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఇంత కాలం పాలకులు మొద్దు నిద్ర పోయి.. ఉన్నట్టుంది.. రాత్రి ఏదో కల వస్తే.. పొద్దున్నే హడావుడి చేసిన చందంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఉస్మానియా  ఆసుపత్రిని సందర్శించి.. దాన్ని వారం లోపు తరలించేస్తామంటూ ప్రకటించేశారు.

ఎందుకింత తొందర అంటే.. ఇప్పటికే ఆలస్యమైందని.. తాను ఇప్పటికే ఆలస్యం చేశానని.. ఇక ఎలాంటి ఆలస్యం ఉండకూడదని.. వైద్యులు.. సిబ్బంది.. వైద్య విద్యార్థులు.. రోగుల ప్రాణాలు తమకు చాలా విలువైనవని.. వారికి ఏదైనా జరిగితే చూస్తూ ఉండమని.. అందుకే.. ఆసుపత్రిని మార్చేసి.. కొత్త భవనాన్ని నిర్మిస్తామంటూ ప్రకటన చేశారు.

ఉస్మానియా ఆసుపత్రి శిధిలమై.. దాని స్థానంలో కొత్త ఆసుపత్రి కట్టించుకోవాలని అనుకోవటం మంచిదే. కానీ.. ఈ హడావుడి ఏమిటి? ఇప్పటికిప్పుడు.. ఆసుపత్రి కూలిపోతుంటే పడే హడావుడి మాదిరి.. కేసీఆర్ ఎందుకు వ్యవహరిస్తున్నారు? ముఖ్యమంత్రి మాటల్నే చూస్తే.. తానిప్పటికే ఆలస్యం చేశానని చెప్పుకున్నారు. తనకు తానే ఆలస్యం చేసినట్లు చెబుతున్న కేసీఆర్.. ఇంకొంత కాలం ఆలస్యం కావటం వల్ల జరిగే ప్రమాదం నిజంగా ఉందా? అన్నది ఒక ప్రశ్న?

ఉస్మానియా ఆసుపత్రిని మార్చటం అంటే.. ఒక వ్యక్తి ఇల్లు మారినంత తేలిక కాదు. ఒక వ్యక్తికి ఇల్లు మారటం ఎంత కష్టమో.. ఒక ప్రభుత్వానికి ఉస్మానియా ఆసుపత్రిని మార్చటం అంతకు మించి కష్టం. ఎందుకంటే.. ఉస్మానియా తరలింపులో ఎన్నో కష్టాలు ఉన్నాయి. వందల కోట్లు విలువ చేసే పరికరాలు మొదలు.. ఉస్మానియా ఆసుపత్రికి ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీ భవితవ్యం ఉంటుంది.

దాన్లో ఏ చిన్న తేడా వచ్చినా.. పెద్ద ఎత్తున వైద్య విద్యార్థులు ఇబ్బందుల్లో పడతారు. అయితే.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించి.. భారత వైద్య విధాన మండలితో తానే స్వయంగా మాట్లాడతానని.. సమస్యకు పరిష్కారం చూస్తానని చెప్పుకొచ్చారు. అంతా నేను చూసుకుంటానన్న భరోసా బాగుంది కానీ.. ఒక ప్రణాళిక.. పక్కా విధానం లేకుండా లేడికి లేచించే పరుగన్నట్లుగా నిర్ణయాలు వేలాది మంది మీద ప్రభావితం చూపిస్తాయన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తిస్తే బాగుంటుంది.
Tags:    

Similar News