దీపావళి థమాకాను సిద్ధం చేసిన కేసీఆర్

Update: 2016-10-23 04:58 GMT
పెద్ద పండగలు వస్తుంటే ఆ హుషారే వేరుగా ఉంటుంది. దీనికి తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పండగల్ని పార్టీ నేతలంతా గుర్తుంచుకునేలా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొన్నటికి మొన్న దసరా పండగ సందర్భంగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణను ఎంత భారీగా చేపట్టారో తెలిసిందే. పది జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పుణ్యమా అని ఏకంగా 31జిల్లాలుగా మారిపోయిన పరిస్థితి. ఈ నెల మొదట్లో జరిగిన దసరాను ఇప్పట్లో మర్చిపోలేని విధంగా చేసిన కేసీఆర్.. దీపావళి థమాకాను సిద్ధం చేశారు.

పాలనా పరంగా దసరాకు భారీ మార్పులు చేసిన ఆయన.. ఈ వారంతానికి వచ్చే దీపావళి సందర్భంగా పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్తజిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో.. పార్టీ జిల్లాల రథసారధుల్ని నియమించటంతో పాటు.. ఎప్పటి నుంచో ఊరిస్తున్న కొన్ని కార్పొరేషన్ల పదవులకు సంబంధించిన నియమకాల్ని చేపట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

రాష్ట్ర స్థాయిలో 30 వరకు కార్పొరేషన్ పదవులు ఉండగా.. ఇప్పటికి 14 పదవుల్ని భర్తీ చేశారు. మిగిలిన 16 పదవుల్ని విడతల వారీగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ క్రమంలో మరికొన్ని పదవుల్ని భర్తీ చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇదంతా పండగ ముందే జరుగుతుందని చెబుతున్నారు. కార్పొరేషన్ల పదవుల భర్తీకి ముందే.. పార్టీ జిల్లా రథసారధులతో పాటు.. ప్రధాన కార్యదర్శకుల నియామకాన్ని పూర్తి చేయనున్నారు. దీంతో.. పదవుల్ని ఆశిస్తున్న వారిలో ఉత్కంఠను  కేసీఆర్ పెంచేశారు. మొత్తంగా చూస్తే.. దీపావళి హడావుడి కూడా భారీగానే ఉండనుందని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News