టీఆర్ ఎస్ ఎంపీలకు కేసీఆర్ సరికొత్త బాధ్యత

Update: 2016-07-18 04:16 GMT
వ్యూహాలు పన్నటం.. అమలు చేయటంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఘనుడన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ తానే కనిపించాలన్న తపన కేసీఆర్ లో కనిపించదు. అదే సమయంలో.. తనకు తెలీకుండా చీమ కూడా కదలకూడదన్నట్లుగా వ్యవహరించటం ఆయనకే సాధ్యమవుతుందని చెప్పాలి. అందరికి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా కనిపిస్తూనే.. ఎవరికెంత స్వేచ్ఛ ఇవ్వాలో అంత మాత్రమే ఇచ్చే విలక్షణ మైండ్ సెట్ ఉన్న కేసీఆర్ తాజాగా ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు.

కేంద్రానికి.. రాష్ట్రానికి మధ్య వారధులుగా వ్యవహరించే తమ పార్టీ ఎంపీలకు కేసీఆర్ సరికొత్త బాధ్యతను ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆ రోల్ ఏమిటంటే.. ఇద్దరు లేదంటే ముగ్గురు టీఆర్ ఎస్ ఎంపీలకు కేంద్రంలోని ఒకటి లేదంటే రెండు కీలక శాఖలను అప్పగిస్తారు. వీరు సదరు కేంద్రమంత్రులను తరచూ కలవటం.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించటం.. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించటం లాంటివి చేస్తారు. ఈ సమాచారాన్ని వారు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి పంపిస్తారు. ఎంపీల సలహాలు.. సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పని చేయాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో పెండింగ్ ఉన్న అంశాల మీద అధికారులు.. ఎంపీలకు ఫీడ్ బ్యాక్ ఇస్తుంటారు. దీనికి అనుగుణంగా వారు తమ ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ వాటి పరిష్కారం సాధ్యం కాని పక్షంలో వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ విధానంతో సీఎం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండటం.. ఎంపీలపై మరింత బాధ్యత పెట్టటం.. వారిని మరింత చైతన్యవంతంగా పని చేసేందుకు వీలుగా తాజా నిర్ణయం అవకాశం కల్పిస్తుందన్న మాట వినిపిస్తోంది. మరి.. కేసీఆర్ ప్లాన్ ఎంత మేర వర్క్ వుట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News