అసద్ అడ్డాలో ఫ్రెండ్లీగా కేసీఆర్ పాగా?

Update: 2016-10-13 05:06 GMT
తన రాజకీయ స్నేహితుడికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ ఇవ్వనున్నారా? అన్న ప్రశ్నకు ఎలాంటి సందేహం లేకుండా అవునని చెప్పక తప్పదు. కొత్త జిల్లాల ఏర్పాటును తాను అనుకున్నట్లుగా పూర్తి చేసిన కేసీఆర్ మాటల్లో ఆత్మవిశ్వాసం ఇప్పుడు మరింత పెరిగింది. విపక్షాలు వణికిపోయేలా.. భయంతో కుంచించుకుపోయేలా మాట్లాడటం కేసీఆర్ కు కొత్త కాకున్నా.. స్నేహితుడికి సైతం షాకిచ్చేలా మాట్లాడటమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎక్కడైనా బావే కానీ.. వంగతోట దగ్గర మాత్రం కాదన్నట్లుగా వ్యవహరించే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి మైండ్ బ్లాక్ అయ్యే మాట ఒకటి కేసీఆర్ నోటి నుంచి వచ్చింది. పాతబస్తీలో పోటీ మాట తర్వాత.. కనీసం అక్కడికి వేరే పార్టీ అడుగుపెట్టటానికి కూడా ఇష్టపడని తత్వం అసదుద్దీన్ ఓవైసీది. పాతబస్తీ తమ అడ్డా అని.. అక్కడ తాము తప్ప మరెవరూ ఉండకూడదన్న విషయాన్ని అస‌ద్‌ బాహాటంగానే చెప్పేస్తుంటారు.

అలాంటి అసద్ తో తాను త్వరలో మాట్లాడతానని.. పాతబస్తీలో తమకు పని చేయటానికి అవకాశం ఇవ్వాలని కోరనున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం గమనార్హం. ఘర్షణకు తావు లేకుండా కార్యకలాపాలు చేపడతామని చెప్పినఆయన.. తెలంగాణ వచ్చిన వేళ.. తమ సర్కారును అస్థిర పర్చటానికి కుట్ర జరిగినప్పుడు.. అసద్ తమకు అండగా నిలిచిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయనో కీలక అంశాన్ని ప్ర్రస్తావించారు.

మిగిలిన పార్టీలన్నీ ఎన్నికల వేళ పాతబస్తీకి వెళతాయని.. కానీ.. మజ్లిస్ మాత్రం ఎప్పుడూ అక్కడి ప్రజలతో సన్నిహితంగా ఉంటుందన్న కేసీఆర్.. అలాంటి తత్వాన్ని టీఆర్ ఎస్ సైతం కొనసాగించాలని కోరారు. తన బంగారుపుట్టలో వేలు పెట్టటం తర్వాత.. దాని సమీపానికి వస్తున్నా గయ్యిమనే అసద్ కు కరెంటు షాక్ తగిలేలా.. అసద్ అడ్డాలో ఫ్రెండ్లీగా అడుగు పెడతామని.. పాగా వేస్తామంటూ సీఎం కేసీఆర్ చెప్పటంపై అసద్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News