యాగాలే కానీ జనాల ఇబ్బందులు పట్టవా సారూ?

Update: 2019-07-31 04:52 GMT
సీఎం సారు కాస్తా.. యాగాల సారుగా మారిపోతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఓట్లేసి పాలన చేయమని అధికారాన్ని చేతికి ఇస్తే.. మూణ్నెల్లకోసారి ఏదో ఒక ప్రత్యేక పూజ చేసే కేసీఆర్.. ఆర్నెల్లకోసారి ఏదో ఒక యాగంతో అదరగొట్టేస్తుంటారు.

పాలకుడిగా ప్రథమ కర్తవ్యం ప్రజల కష్టాలు.. కన్నీళ్లకు చెక్  చెప్పటం. వారు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం వెతకటం అవసరం. ఆ విషయాన్ని వదిలేసి.. పూజలు.. పునస్కారాలు.. పాత కట్టడాల్ని కూల్చేసి కొత్తవి నిర్మించటం మీదనే ఫోకస్ చేసే ముఖ్యమంత్రి జనాల జీవితాల్ని ప్రభావితం చేసే అంశాల మీద ఎందుకు పట్టదన్నది ప్రశ్నగా మారింది.

తాజాగా మరో భారీ యాగానికి తెర తీశారు కేసీఆర్. పాలకులు పాలన చేయాలే కానీ యాగాలు కాదు. సరే.. యాదాద్రిలో ఆయన తలపెట్టే భారీ యాగానికి అయ్యే ఖర్చు ఎవరిది?  ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే ప్రజాధనంతోనే. ఆ డబ్బుతో నరకంగా మారిన హైదరాబాద్ రోడ్లను మార్చేందుకు ఖర్చు చేస్తే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది. దానికి బదులుగా నమ్మకాల కోసం ఖర్చు చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి?

దేవుడు ఉన్నాడా?  లేడా?  అన్న చర్చలోకి వెళ్లటం లేదు. నమ్మకాల జోలికి వెళ్లటం లేదు. కాకుంటే.. ఎవరి వ్యక్తిగత సెంటిమెంట్లు వారివి. వాటిని అందరూ గౌరవించాల్సిందే. కాకుంటే.. నా సెంటి మెంట్ ను తీర్చుకోవటం కోసం ఊరు సొమ్మును వాడేస్తానన్నప్పుడే అభ్యంతరమంతా.

దాదాపు 700 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న హైదరాబాద్ మహానగరంలో తక్కువలో తక్కువ 200 కీలోమీటర్ల మేర లక్షలాది మంది ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తుంటారు. ఈ రోడ్లు సరిగా లేని కారణంగా జరుగుతున్న ప్రమాదాలు ఒక ఎత్తు అయితే.. ఆ ప్రమాదాల కారణంగా మరణిస్తున్న ప్రజల సంగతేమిటి? అన్నది మరో ప్రశ్న. 

ఎన్నో కుటుంబాలను బలి తీసుకుంటున్న రోడ్లను సరిగా చేస్తే దాని కారణంగా కోటిన్నర ప్రజలకు ప్రయోజనంగా మారుతుంది. కేసీఆర్ సారు అధికారంలోకి వచ్చి ఐదేళ్లు దాటి.. ఆరో ఏడు దిశగా పరుగులు తీస్తుంది. అరవై ఏళ్ల పాలనలో హైదరాబాద్ ను నాశనం చేశానని వాపోయే ముఖ్యమంత్రి.. తన ఐదేళ్ల పాలనలో కించిత్ కూడా మార్చలేకపోయారన్న చేదు నిజాన్ని ఎప్పటికి గ్రహిస్తారు. విమర్శలతో ఉతికి ఆరేసే ముఖ్యమంత్రి.. అవే విమర్శలు తనను వేలెత్తి చూపిస్తాయన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతారు?  క్యాలెండర్లో  ఏళ్లు మారుతున్నాయి.. కానీ.. హైదరాబాద్ మారటం కాదు.. రోడ్ల రూపురేఖలు కూడా మారటం లేదు. ఇదేనా మీరు కోరుకున్న విశ్వ నగరం?
Tags:    

Similar News