కేసీఆర్ సుడి మామూలుగా లేదా?

Update: 2019-06-05 04:48 GMT
తెలిసిన విష‌యాల్ని తెలియ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం కొంద‌రు చేస్తుంటారు. తెలంగాణ రాజ‌కీయ ప‌క్షాలు.. మీడియా ఇదే తీరును ప్ర‌ద‌ర్శిస్తుందా? అంటే అవున‌ని చెప్పాలి. ఏ ఎన్నిక‌ల‌కు ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యంలో ఓట‌ర్లు వ్య‌వ‌హ‌రిస్తున్న వ్య‌వ‌హార‌శైలిని అర్థం చేసుకునే విష‌యంలో రాజ‌కీయ ప‌క్షాలు.. మీడియా త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్నాయి. వాపును బ‌లుపుగా చూపించ‌టం.. ఆ వెంట‌నే తాము చేసిన త‌ప్పును అర్థం చేసుకోవ‌టానికి బ‌దులు అయోమ‌యానికి గురై మ‌రిన్ని త‌ప్పులు చేస్తున్న వైనం ఇప్పుడు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిచిన కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన మీడియా.. ఇటీవ‌ల జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎదురుదెబ్బ త‌గ‌ల‌టాన్ని త‌న‌దైన శైలిలో విశ్లేషించింది. టీఆర్ ఎస్ బ‌లం త‌గ్గిపోయింద‌ని.. బీజేపీ బ‌ల‌ప‌డుతోందంటూ ఒక‌ర‌క‌మైన ట్రాన్స్ లో ఉన్న‌ట్లుగా క‌థ‌నాల్ని విశ్లేషించింది. అయితే.. ఇందులో నిజాల కంటే క‌ల్ప‌న‌లే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పాలి.

టీఆర్ ఎస్ బ‌లం తెలంగాణ‌లో ఇప్ప‌ట్లో త‌గ్గే ప‌రిస్థితి లేదు.  అలా అని ప్ర‌జ‌లు కేసీఆర్ పాల‌న విష‌యంలో సంతృప్తిక‌రంగా ఉన్నారా? అంటే అది కూడా లేదు. కాకుంటే.. ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌టంతో ఇష్టం లేకున్నా.. కేసీఆర్ తో కంటిన్యూ అవుతున్నారు. కేసీఆర్ మీద కోపాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు అవ‌కాశం వ‌స్తే మాత్రం దాన్ని వ‌దులుకోవ‌టానికి ఏ మాత్రం సిద్ధంగా లేర‌న్న విష‌యం ఇటీవ‌ల ప‌రిణామాల్ని చూస్తే అర్థం కాక మాన‌దు.

కానీ.. ఆ విష‌యాన్ని సూటిగా చెప్పే విష‌యంలో మీడియా.. రాజ‌కీయ ప‌క్షాలు ఫెయిల్ అవుతున్నాయి. అసెంబ్లీలో బాబు సెంటిమెంట్ తో కేసీఆర్ కు జై కొట్టిన తెలంగాణ ఓట‌ర్లు.. లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి.. స్థానిక అంశాల కంటే కూడా.. సెంట్ర‌ల్ లో బీజేపీకి.. మోడీకి ద‌న్నుగా నిల‌వాల‌న్న త‌లంపు బ‌లంగా క‌నిపించింది. ఇదే.. కేసీఆర్ కు షాకింగ్ గా మారింది. ఇక‌.. నిజామాబాద్ లో కేసీఆర్ కుమార్తె ఓట‌మి క‌చ్ఛితంగా ఆమె మీద ఉన్న వ్య‌క్తిగ‌త వ్య‌తిరేక‌త‌గా చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీదా.. కేటీఆర్ మీదా క‌నిపించ‌ని కోపం క‌విత మీద క‌నిపిస్తూ ఉంటుంది. ఈ కార‌ణంతోనే ఆమె ఓడిపోవాల్సి వ‌చ్చింది.

లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే తాజా స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌టం.. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే గులాబీ కారు క్లీన్ స్వీప్ చేసేయ‌టం క‌నిపించింది. త‌క్కువ స‌మ‌యంలోనే కేసీఆర్ త‌న మీద ఉన్న వ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించార‌ని.. లోక్ స‌భ ఎన్నిక‌ల పోలింగ్ త‌ర్వాత జ‌రిగిన స్థానిక పోలింగ్ లో గులాబీ కారుకు ఓటు వేయ‌టం అంటే.. వ్య‌తిరేక‌త త‌గ్గిపోవ‌టంగా కొంద‌రు అర్థం లేని విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు.

స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ గుర్తు కంటే.. స్థానికంగా ఉంటే అభ్య‌ర్థుల ప్ర‌భావంతో పాటు ఇత‌ర అంశాలు చాలానే ఉంటాయి. ఇవాల్టి రోజున తెలంగాణ‌లో టీఆర్ ఎస్ మిన‌హా మిగిలిన పార్టీలు ఏవీ యాక్టివ్ గా ఉన్న‌ది లేదు.  ఆ మాట‌కు వ‌స్తే.. ఎమ్మెల్యేలే లేని పార్టీల‌కు.. ప్ర‌త్యేకంగా గెలుపు ఎలా సాధ్య‌మ‌వుతుంది?

అలాంట‌ప్పుడు కేసీఆర్‌ పార్టీ గెలుపు ఇప్పుడు అద్భుతంగా.. అదిరిపోయే విజ‌యంగా అభివ‌ర్ణించ‌టానికి మించిన త‌ప్పు మ‌రొక‌టి ఉండ‌దు. కేసీఆర్ సుడే సుడి అని.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను కేసీఆర్ అధిగ‌మించార‌న్న విశ్లేష‌ణ‌లు అర్థం లేనివిగా చెప్ప‌క త‌ప్ప‌దు.  తాజా విజ‌యాన్ని దేశ చ‌రిత్ర‌లోనే చారిత్మాత్మ‌క తీర్పుగా టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాంటివాళ్లు అభివ‌ర్ణించ‌టాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు సింఫుల్ గా కామెడీ చేసుకోవ‌టం ఖాయ‌మ‌ని ఆయ‌న గుర్తిస్తే మంచిది.
Tags:    

Similar News