రాజ్య‌స‌భ‌కు కుటుంబ సభ్యుడు కాదు..కేసీఆర్ అత్యంత ఆప్తుడు

Update: 2018-03-01 16:23 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని ప్ర‌చారం. అంద‌రూ అనుకుంటున్న‌ట్లు రాజ్య‌స‌భ‌కు త‌న ఇంటి మ‌నిషిని కాకుండా...త‌న‌కు అత్యంత ఆప్తుడిని పంపుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల వెలువ‌డిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ నుంచి మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం శాసన సభలో ఉన్న రాజకీయ పార్టీల బలాబలాల ఆధారంగా ఈ మూడు స్థానాలు కూడా అధికార పార్టీ టీఆర్‌ ఎస్‌ ఖాతాలోకే వెళ్ళడం ఖాయమైపోయింది. ఈ నేప‌థ్యంలో త‌న సన్నిహితుడు అయిన మైహోం రామేశ్వ‌ర‌రావును బ‌రిలో దింప‌నున్నార‌ని అంటున్నారు.

ఈ సారి రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి గులాబీ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేయనుంది. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఒక రాజ్యసభ అభ్యర్ధి విజయానికి 30 ఓట్లు అవసరం కానున్నాయి. దీంతో పోలింగ్‌ అవసరం లేకుండానే ఏకగ్రీవంగా ఈ ఎన్నికలు జరిగే  పరిస్థితులు కనిపిస్తున్నాయి.   ప్రస్తుతం తెలంగాణ శాసన సభలో అధికార పార్టీకి 90 మంది సభ్యుల బలం ఉంది.  అలాగే ఏడుగురు సభ్యులు కలిగిన మజ్లిస్‌ పార్టీ కూడా టీఆర్‌ ఎస్‌ కే మద్ధతు ఇవ్వనున్నది. దీంతో శాసనసభలో టీఆర్‌ ఎస్‌ కు 97 మంది మద్ధతు ఉంటుంది.  ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడు గెలువాలంటే 30 ఓట్లు అవసరమని ఎన్నికల కమిషన్‌ నిర్ధారించింది. దీంతో మూడుకు మూడు రాజ్యసభ స్థానాలను టీఆర్‌ ఎస్‌ కైవసం చేసుకోవడం ఖాయమైపోయింది.

ఈ క్ర‌మంలో ముఖ్యమంత్రికి బంధువు - నిత్యం వెన్నంటి ఉండే జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పేరు రాజ్యసభ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. గడిచిన 15 ఏళ్లుగా సంతోష్‌ కుమార్‌ కేసీఆర్‌ కు అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మితభాషి, మృధు స్వభావిగా పార్టీ నేతలందరిలోనూ ఆయనకు మంచి పేరుంది. పార్టీ సంస్థాగత పదవుల నియామకం సందర్భంగా ముఖ్యమంత్రి గత ఏడాది సంతోష్‌ కుమార్‌ కు కీలక బాధ్యతలే అప్పగించారు. ఆయ‌న‌కే పెద్ద‌ల స‌భ చాన్స్ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆయ‌నకు కాకుండా...ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త మైహోం రామేశ్వ‌ర‌రావుకు చాన్స్ ఇస్తార‌ని స‌మాచారం.

మైహోం రామేశ్వ‌ర‌రావుకు ఎంపిక‌కు అనేక కార‌ణాలు ఉన్న‌ట్లు స‌మాచారం. సీఎంకు అత్యంత సన్నిహితుడు కావటంతో పాటు రామేశ్వరరావు చిన్నజీయర్‌ స్వామికి ప్రియ శిష్యుడు. మైహోమ్‌ సంస్థల అధినేత - బడా పారిశ్రామికవేత్తగా రామేశ్వరరావు రాష్ట్రంలో అందరికి సుపరిచితుడు. ఇటీవల శంషాబాద్‌ ఏరియాలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యసభ సీటుపై రామేశ్వరరావుతో చర్చించినట్లు సమాచారం. రామేశ్వ‌ర‌రావు పేరు ఖ‌రారు అయితే సంతోష్ పేరు ప‌క్క‌కు పోవ‌డం ఖాయ‌మంటున్నారు.
Tags:    

Similar News