చెన్నై లోనూ టెంపుల్‌ కు వెళ్లిన కేసీఆర్‌

Update: 2018-04-30 05:09 GMT
ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఈ మ‌ధ్య‌న టూర్ల మీద టూర్లు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి తాజాగా చెన్నై టూర్ లో ఉన్న విష‌యం తెలిసిందే. తొలుత ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో తొలిభేటీ జ‌రిపిన కేసీఆర్‌.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మీటింగ్ అదిరిపోయే బోణీలా అభివ‌ర్ణించుకోవ‌టం తెలిసిందే.

కేసీఆర్ అండ్ కో బెంగాల్ టూర్ ను గొప్ప‌గా చెప్పుకుంటే.. అక్క‌డి మీడియా మాత్రం కేసీఆర్ కోల్ క‌తాకు వ‌చ్చింది మ‌మ‌త భేటీ కంటే కూడా.. అక్క‌డి టెంపుల్ కోస‌మ‌న్న‌ట్లుగా రాశాయి. గుడి కోసం వ‌చ్చిన కేసీఆర్‌.. మ‌ర్యాద‌పూర్వ‌కంగా దీదీతో భేటీ అయ్యార‌ని.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మీద పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌న్న‌ట్లుగా చెప్పాయి. మ‌మ‌త‌తో కేసీఆర్ భేటీ అనంత‌రం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లేమీ దీదీ చేయ‌క‌పోవ‌టాన్ని బెంగాలీ ప‌త్రికలు ప్ర‌స్తావించాయి. ఇదిలా ఉంటే ఒడిశాకు సైతం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ముచ్చ‌ట కోసం వెళుతున్న‌ట్లుగా కేసీఆర్ చెప్ప‌గా.. అలాంటిదేమీ లేద‌ని.. గుడికి వెళ్లే ప్రోగ్రాంలో భాగంగా కేసీఆర్ వ‌స్తున్నార‌ని.. మ‌ర్యాద‌పూర్వ‌కంగా త‌న‌ను క‌లుస్తున్నారే త‌ప్పించి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ముచ్చ‌ట మీద కాద‌న్న‌ట్లుగా ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తేల్చేయ‌టంతో కేసీఆర్ టూర్లు అన్నీ గుళ్ల కోస‌మేనా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇక‌.. తాజా చెన్నై టూర్ మీద హైప్ క్రియేట్ అవుతున్న వేళ‌.. మిగిలిన ప‌ర్య‌ట‌న‌ల్లో మాదిరి గుళ్ల ప్ర‌స్తావ‌న రాక‌పోవ‌టంతో.. గ‌తంలో జ‌రిగిన చ‌ర్చలో అర్థం లేదేమో? అన్న సందేహం క‌లిగేలా చేసింది. అయితే.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మీటింగ్ తో పాటే.. గుడి సంద‌ర్శ‌న చెన్నై టూర్లోనూ కొన‌సాగింద‌ని చెబుతున్నారు.

చెన్నైకి వెళ్లిన కేసీఆర్ తొలుత క‌రుణ‌తో భేటీ కావ‌టం.. ఆ పై స్టాలిన్ ఇంట్లో విందుభోజ‌నం చేయ‌టం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం అయ్యాక చెన్నైలోని ఫైవ్ స్టార్ హోట‌ల్లో బ‌స చేసిన కేసీఆర్‌.. సాయంత్రం చెన్నైలోని క‌పాలేశ్వ‌ర‌స్వామి దేవాల‌యాన్ని సంద‌ర్శించ‌టం గ‌మ‌నార్హం. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ టూర్ల పేరుతో సాగుతున్న వైనంలో ఎప్ప‌టిక‌ప్పుడు గుళ్ల‌ను మిస్ కాకుండా వెళుతున్న కేసీఆర్ వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.
Tags:    

Similar News