అంత బిజీలోనూ ఫ్రెండ్ ఇంటికెళ్లిన కేసీఆర్

Update: 2016-10-11 07:24 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్త భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కాన్వాయ్ ఎంత వేగంగా వెళుతుందో అందరికి తెలిసిందే. అంత వేగంలో వెళుతున్న సమయంలో.. తమ ఊరికి చెందిన వారు కానీ.. తనకు తెలిసిన వారు కానీ రోడ్డు మీద కనిపిస్తే చాలు.. వేగంగా దూసుకెళుతున్న కేసీఆర్ కాన్వాయ్ చప్పున ఆగుతుంది. కారు దిగి.. తెలిసిన వారితో మాట్లాడిన తర్వాత కానీ కేసీఆర్ కదలరు. ఇలాంటి వైఖరి కేసీఆర్ లో తరచూ కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు.. ఆయనెంతో ఇష్టంగా భావించే ఫాంహౌస్ కు వెళ్లే క్రమంలోనూ తెలిసిన వారు కనిపిస్తే ఆయన తన కారును ఆపటం కనిపిస్తుంది. తెలిసిన వారి విషయంలోనే ఇంత ప్రాధాన్యత ఇస్తే.. పాత స్నేహితులను కలుసుకునే విషయంలో ఇంకెంత ప్రాధాన్య‌తనిస్తారో వేరే చెప్ప‌క్క‌ర్లేదు. పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకొని మరీ వారి ఇళ్లకు వెళ్లటం లాంటివి కేసీఆర్ చేస్తుంటారు.

తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో హడావుడిగా ఉన్న వేళ సైతం.. తన స్నేహితుడ్ని మాత్రం మర్చిపోలేదు ముఖ్యమంత్రి కేసీఆర్. మెదక్ జిల్లా ములుగు మండలం మర్కుక్ కు చెందిన మహేందర్ రెడ్డితో కేసీఆర్ కు పాత దోస్తానా ఉంది. సిద్ధిపేటలో వీరి రాజకీయ స్నేహం చాలా బలమైనదిగా చెబుతారు. ఇటీవల మహేందర్ రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్.. సోమవారం సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకోవటమే కాదు.. ఆయనతో దాదాపు అరగంటకు పైనే ముచ్చటించి వెళ్లటం గమనార్హం. అనంతరం.. కేసీఆర్ రోడ్డు మార్గంలో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News