కేసీఆర్‌ జీ.. ఈ ఉడ్తా హైద‌రాబాద్ ఏంది?

Update: 2017-07-07 17:00 GMT
హైద‌రాబాదీయుల‌కు కొత్త వేద‌న ఒక‌టి మొద‌లైంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ హైద‌రాబాదీ అంటూ రొమ్ము విరుచుకొని గ‌ర్వంగా చెప్పుకున్న వారంతా.. ఇప్పుడు హైద‌రాబాద్ అని చెప్పుకునేందుకు కాస్తంత బిడియ‌ప‌డుతున్నార‌ట‌. దేశంలో ఎక్క‌డ తీవ్ర‌వాద కార్య‌క‌లాపాలు చోటు చేసుకున్నా.. దాని మూలాలు హైద‌రాబాద్ లోనే ఉంటాయ‌న్న విమ‌ర్శ ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. అయితే.. నిఘా అధికారులు.. పోలీసు అధికారుల తీరుతో ఉగ్ర‌వాద చ‌ర్య‌ల్ని మొగ్గ‌ద‌శ‌లోనే గుర్తించి పీకి పారేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా వెలుగు చూసిన డ్ర‌గ్స్ దందా హైద‌రాబాద్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తోంది. కోటి కంటే ఎక్కువ జ‌నాభా ఉన్న ఒక మ‌హాన‌గ‌రంలో డ్ర‌గ్స్ లాంటివి కొన్ని మామూలే. అంత‌మాత్రానికే హైద‌రాబాద్ అన‌గానే.. డ్ర‌గ్స్ మ‌త్తులో ఊగిపోతున్న‌ట్లుగా రాత‌లు రావ‌టం ఎక్కువైంద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

ఇంత పెద్ద మ‌హాన‌గ‌రంలో త‌ప్పులు చేసే వారు కామ‌న్‌. అంత‌మాత్రానికే ఉడ్తా హైద‌రాబాద్ అని కొంద‌రు.. డ్ర‌గ్స్ అడ్డా హైద‌రాబాద్ అని మ‌రికొంద‌రు చేస్తున్న ప్ర‌చారానికి అస‌లుసిస‌లు హైద‌రాబాదీలు తీవ్ర ఆవేద‌న‌కు గురి అవుతున్నారు.
ఎక్క‌డో బ‌లిసిన బిడ్డ‌లు కొంద‌రు వేసే వేషాల‌కు న‌గ‌రంలోని జ‌నాల్ని భ‌య‌పెట్టేలా రాత‌లు రాసేయ‌టం స‌రికాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేనా..  అధికారులు చెప్ప‌కున్నా.. ప్ర‌ముఖ పాఠ‌శాల‌లు.. కాలేజీల పేర్ల‌ను రాసేస్తున్న వైనం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నే  రేపుతోంది. ఇలాంటి దుందుడుకు తీరుతో.. త‌ప్పు చేసినోళ్లు మాత్ర‌మే కాదు.. ఆ స్కూల్‌.. కాలేజీలో చ‌దివే విద్యార్థులంద‌రి మీదా త‌ప్పుడు ముద్ర ప‌డుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఓప‌క్క ఇంత ర‌చ్చ న‌డుస్తున్నా.. హైద‌రాబాద్‌ ను తాను ప్రేమించినంత బాగా మ‌రెవ‌రికీ సాధ్యం కాద‌న్న‌ట్లుగా మాట‌ల్లో చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కామ్ గా ఉండ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఓప‌క్క హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బ తింటుంటే.. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి.. కామ్ గా ఉండ‌టం ఏమిట‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికైనా కేసీఆర్ క‌లుగుజేసుకొని.. ఉడ్తా హైద‌రాబాద్ అంటూ చేస్తున్న ప్ర‌చారానికి చెక్ పెట్టాల‌ని కోరుకుంటున్నారు. మ‌రి.. ఇలాంటి వారి మాట‌లు కేసీఆర్ చెవికి చేరుతాయా?

Tags:    

Similar News