కేసీఆర్ వార్నింగ్ ఆర్టీసీ ఉద్యోగుల‌కేనా? అంద‌రికా?

Update: 2018-06-08 04:54 GMT
భ‌య‌ప‌డుతుంటే భ‌య‌పెడుతుంటారు. అదే భ‌య‌పెట్ట‌టం మొద‌లు పెడితే భ‌య‌ప‌డుతుంటారు. రెండింటికి తేడా చాలా ఎక్కువ‌గా క‌నిపిస్తున్నా.. రెండింట్లోనూ కామ‌న్ గా క‌నిపించేది భ‌య‌మే. దాన్ని ఎవ‌రు ఎలా వాడ‌తార‌న్న దాని మీద‌నే అవ‌త‌ల‌వారి స్పంద‌న ఉంటుంది.

50వేల మంది ఉద్యోగులంటే.. 50 వేల కుటుంబాలు. ఇదేమీ చిన్న అంకె కాదు. కానీ.. ఆర్టీసీ కార్మికుల జీతాల విష‌యంలో కేసీఆర్ ఇప్ప‌టికే ఒక‌లా ఫిక్స్ అయ్యారు. అందుకు భిన్నంగా ఆ సంస్థ కార్మిక సంఘ నేత‌లు రియాక్ట్ కావ‌టం కేసీఆర్ కు  ఏమాత్రం న‌చ్చ‌టం లేదు. ఇప్ప‌టికే త‌న అసంతృప్తిని పలుమార్లు వ్య‌క్తం చేసినా.. ముఖ్య‌మంత్రి మ‌న‌సునుకు త‌గ్గ‌ట్లుగా త‌మ తీరును మార్చుకోలేదు. స‌మ్మె విష‌యంలో తాము అనుకున్న‌దే చేస్తామ‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు అదే.. కేసీఆర్ కోపానికి కార‌ణంగా చెప్పాలి.

ఆర్టీసీ కార్మికుల జీతాల పెంచితేనే భారం పెరిగిపోదు. ఎవ‌రి జీతాలు పెంచినా అలాంటి ప‌రిస్థితే ఉంటుంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాల్ని పెంచే విష‌యంలో పెద్ద‌మ‌న‌సుతో వ్య‌వ‌హ‌రించే కేసీఆర్‌.. ఆర్టీసీ ఉద్యోగుల విష‌యంలో మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ కావ‌టం క‌నిపిస్తుంది.

ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు మిగిలిన రాష్ట్రాల‌తో పోలిస్తే ఎక్కువ‌గా ఉందంటూ గ‌ణాంకాలు చూపిస్తున్నారు. ఇప్పుడు కార్మిక సంఘాలు కోరిన‌ట్లుగా జీతాలు పెంచితే రూ.1400 కోట్ల అద‌న‌పు భారం ప‌డుతుంద‌న్న మాట‌ను ఆయ‌న చెబుతున్నారు. ప‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్న వేళ మ‌ళ్లీ రూ.1400 కోట్ల అద‌న‌పు భారాన్ని తెలంగాణ రాష్ట్రం మోస్తుందా? అన్న ప్ర‌శ్న‌ను వేశారు. ఆర్థికంగా భార‌మ‌న్న మాట‌ను చెబుతున్న కేసీఆర్‌.. త‌న‌కు న‌చ్చిన‌ప్పుడు చెప్పే మాట‌లు భిన్నంగా ఉండ‌టం క‌నిపిస్తుంది. మ‌న‌కేం మ‌న‌ది సంప‌న్న రాష్ట్రం. మ‌నం మిగిలిన వారి మాదిరి ఎందుకు ఉండాలి?  అంటూ గొప్ప‌లు చెప్పే పెద్ద మ‌నిషి..ఆర్టీసీ ఉద్యోగుల జీతాల విష‌యంలో మాత్రం ఎందుకింత క‌ర‌కుగా ఉన్నార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆర్టీసీ స‌మ్మె మాటకు కేసీఆర్ ఇంత‌గా ఆగ్ర‌హం చెంద‌టానికి కార‌ణం వేరే ఉంద‌న్న‌ట్లుగా చెబుతున్నారు. ఆర్టీసీ సంఘాల‌కు గౌర‌వాధ్య‌క్షుడి హోదాలో మంత్రి హ‌రీశ్ ఉండ‌టం.. ఉద్యోగుల స‌మ్మె మాట‌కు ఆయ‌న ఆమోదం ఉంద‌న్న భావ‌న కేసీఆర్‌లో ఎక్కువ‌ని చెబుతారు. మంత్రే కార్మిక సంఘాల నాయ‌కుల‌కు పెద్ద‌గా ఉన్న‌ప్పుడు.. ప్ర‌భుత్వాన్ని బెదిరించేలా స‌మ్మె మాట ఎలా చెబుతార‌న్న‌ది కేసీఆర్ పాయింట్ గా చెబుతున్నారు.

త‌న‌ను ధిక్క‌రించే తీరుకు తానుఎలా రియాక్ట్ అవుతాన‌న్న విష‌యాన్ని ఆర్టీసీ కార్మికుల సమ్మెపై త‌న స‌మాధానంతో కేసీఆర్ స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి. ఏ ముఖ్య‌మంత్రి నోటి నుంచి రానంత క‌ర‌కుగా కేసీఆర్ రియాక్ట్ కావ‌టం క‌నిపిస్తుంది. అవ‌స‌ర‌మైతే ఆర్టీసీని మూసివేస్తాన‌న్న పెద్ద మాట‌ను చెప్ప‌టం ద్వారా.. సమ్మె మాట కార్మిక సంఘాల నోటి నుంచి రాకుండా చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేసీఆర్‌ లో ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని ఈ తీరు దేనికి సంకేతం? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌.

ఒక ఉద్య‌మ నాయ‌కుడు.. త‌న డిమాండ్ల మీద ఉద్య‌మిస్తాన‌ని చెప్పిన ఉద్యోగ సంఘాల నేత‌ల విష‌యంలో ఇంత ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడేయ‌టం.. అది కూడా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాది కంటే త‌క్కువ ఉన్న వేళ అంటే.. కేసీఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల విష‌యంలో క‌రుకుగా బ‌దులిచ్చిన కేసీఆర్ హెచ్చ‌రిక సారాంశాన్ని కాస్తంత విస్తృతంగా చూస్తే.. ఎవ‌రైనా స‌రే.. త‌న అభిమ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే క‌ష్టాలు కొనితెచ్చుకున్న‌ట్లేన‌న్న మాట‌ను చెప్పేసిన‌ట్లుగా చెప్పాలి. ఇవాళ ఆర్టీసీ కార్మికులు అయితే.. రేపొద్దున ఇంకెవ‌రైనా ఇంతేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రింత బ్యాడ్ టాక్ వ‌చ్చినా వెన‌క‌డుగు వేసేది లేద‌న్న‌ట్లుగా కేసీఆర్ మొండిగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిటంటారా?  అదే.. కేసీఆర్ అంటే!
Tags:    

Similar News