కేసీఆర్‌ కు కోపం వ‌స్తే సీన్ ఇలానే ఉంటుంది!

Update: 2018-06-08 04:35 GMT
కేసీఆర్ అంటే మామూలోడు కాదన్న మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు? అన్న‌ప్పుడు చాలామంది చాలా విష‌యాలు చెబుతారు. కానీ.. ఎప్పుడూ ఎవ‌రూ త‌న గురించి చెప్ప‌ని కోణాన్ని తాజాగా కేసీఆర్ త‌న‌కు తానుగా చూపించారు. ఏదైనా స‌రే.. ఎవ‌రైనా స‌రే.. ప్రేమ‌తో అడ‌గాలే కానీ.. డిమాండ్ చేస్తూ అడిగితే త‌న స్పంద‌న ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని  సూటిగా చెప్పేశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రు ఏ డిమాండ్ తీసుకెళ్లినా (పేకాట విష‌యంపై కాస్తంత సానుకూలంగా ఆలోచించాల‌న్న దానిపై త‌ప్పించి) వారు కోరుకున్న దానికి మించి ఇచ్చేసే కేసీఆర్‌కు కోపం వ‌చ్చేసింది. ఆర్టీసీ విష‌యంలో అస‌లే చిరాగ్గా ఉన్న ఆయ‌న‌.. ఆ సంస్థ ఉద్యోగుల‌కు దిమ్మ తిరిగేలా వార్నింగ్ ఇచ్చేశారు.

ఆర్టీసీ కార్మిక నేత‌ల మాట‌లు విని ఉద్యోగులు మోస‌పోవ‌ద్ద‌ని.. స‌మ్మె ఆలోచ‌న‌ను త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌ని.. అలా కాకుండా స‌మ్మెలో పాల్గొంటే ఉద్యోగాల నుంచి తొల‌గించాల్సి వ‌స్తుందంటూ తీవ్రమైన హెచ్చ‌రిక చేశారు. అక్క‌డితో  ఆగితే.. కేసీఆర్ ఎందుకు అవుతారు?  ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ముఖ్య‌మంత్రి మాట్లాడ‌ని రీతిలో ఆర్టీసీ ఉద్యోగుల‌కు ఆయ‌న సూటిగా.. సుత్తి లేకుండా వార్నింగ్ ఇచ్చేశారు. స‌మ్మెకంటూ వెళితే టీఎస్ ఆర్టీసీ చ‌రిత్ర‌లో ఇదే చివ‌రి స‌మ్మెగా మిగిలిపోతుంద‌ని.. ఆర్టీసీని మూసివేయాల్సి వ‌స్తుంద‌న్న మాట‌ను చెప్పేశారు.

ఒక్క మాట‌లో చెప్పాలంటే.. త‌న అభిమ‌తానికి భిన్నంగా స‌మ్మె చేస్తే.. ఆర్టీసీ ఉద్యోగుల విష‌యంలో ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న మాట‌ను కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఏదో మాట వ‌ర‌స‌కు నాలుగు వార్నింగ్ మాట‌లు చెప్పి వ‌దిలేయ‌కుండా.. తాను స‌మ్మె ఎందుకు వ‌ద్ద‌ని చెబుతున్నానో.. వివ‌రంగా చెప్పుకొచ్చారు. న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీ ప‌ని తీరు గ‌తానికి ఇప్ప‌టికి ఏ మాత్రం మార‌లేద‌ని.. ఇప్పుడు కార్మికులు కోరుతున్న‌ట్లుగా జీతాలు పెంచితే సంస్థ మీద అద‌నంగా రూ.1400 కోట్ల భారం ప‌డుతుంద‌న్నారు.

తెలంగాణ అంటే నాలుగు కోట్ల ప్ర‌జ‌ల‌ని.. కేవ‌లం 53 వేల మంది ఆర్టీసీ కార్మికులు మాత్ర‌మే కాద‌ని.. యావ‌త్ ప్ర‌జా సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. స‌మ్మె అన్న ఆలోచ‌నే ఆత్మ‌హ‌త్యా స‌దృశ్య‌మ‌ని.. ఈ విష‌యాన్ని ఉద్యోగులు ఆలోచించాల‌ని చెప్ప‌టం ద్వారా స‌మ్మె గురించి అన‌వ‌స‌ర‌మైన ఆలోచ‌న‌లు చేయొద్ద‌న్న మాట‌ను చెప్పేశారు.

త‌మ డిమాండ్ల విష‌యంలో ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించ‌ని ప‌క్షంలో ఈ నెల 11 నుంచి సమ్మె చేస్తామ‌ని ఆర్టీసీ కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చిన క్ర‌మంలో.. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఏమాత్రం ఊహించ‌ని రీతిలో సీఎం కేసీఆర్ మండిప‌డటం సంచ‌ల‌నంగా మారింది.

ఎవ‌రేం అడిగినా.. కాద‌న‌కుండా స్పందించే గుణం ఉన్న‌ట్లుగా క‌నిపించిన కేసీఆర్ తాజాగా త‌న‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌ట‌కు తీశారు. తన‌కు ఇష్టం లేని అంశాల విష‌యంలో త‌న‌పై ఒత్తిడి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తే.. వారు ఎవ‌రైనా.. ఎంత‌టి వారైనా స‌రే.. తాను వెన‌క్కి త‌గ్గ‌న్న మాట‌ను తాజా వార్నింగ్ తో చెప్పేశార‌ని చెప్పాలి. ఆర్టీసీ యూనియ‌న్ నాయ‌కులు మొత్తం ఆర్టీసీని ముంచే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. వారి మాట విని కార్మికులు మోస‌పోవ‌ద్ద‌న్నారు. మొద‌ట్నించి ఆర్టీసీ కార్మికుల జీతాల విష‌యంలో సానుకూలంగా లేని కేసీఆర్‌.. తాజాగా స‌మ్మె నోటీసుపై సీరియ‌స్ కావ‌టం.. ఒక‌వేళ త‌న మాట‌కు భిన్నంగా స‌మ్మె చేస్తే ఉద్యోగం పోతుంద‌న్న హెచ్చ‌రిక చేయ‌టం ఒక ఎత్తు అయితే.. ఆర్టీసీని మూసి వేసేందుకు సైతం తాను సిద్ధ‌మ‌న్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న ఇవ్వ‌టం ఉద్యోగ సంఘాలకు షాకింగ్ గా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తానింత చెప్పిన త‌ర్వాత కూడా స‌మ్మెకు దిగితే.. ఆర్టీసీకి ప్ర‌త్యామ్నాయంగా ప్రైవేటు బ‌స్సులు.. వేరే రాష్ట్రాల‌కు చెందిన బ‌స్సులు రోడ్ల మీద‌కు వ‌స్తాయ‌ని.. అలా ఒక‌సారి వ‌చ్చిన త‌ర్వాత వాటిని వెన‌క్కి తిరిగి తీసుకోవ‌టం అంత సులువు కాద‌ని చెప్ప‌టం చూస్తే.. ఆర్టీసీ స‌మ్మెకు త‌న ద‌గ్గ‌ర ప్ర‌త్యామ్నాయ ప్లాన్ ఉంద‌న్న విష‌యాన్ని కేసీఆర్ చెప్పిన‌ట్లైంది. మ‌రి.. ఇంత‌లా కేసీఆర్ విరుచుకుప‌డిన త‌ర్వాత ఆర్టీసీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News