పెళ్లికి వెళ్లిన కేసీఆర్.. ప్రగతిభవన్ లో అధికారుల వెయిటింగ్

Update: 2019-10-19 06:31 GMT
తెలంగాణ ప్రజల మనసుల్ని గెలుచుకోవటం ఎలా అన్న విషయం కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికి తెలీదన్న నానుడికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారం చేతికి వచ్చాక.. ప్రజల మనసుల్ని గెలుచుకునే కన్నా.. తన పట్టుదలను ప్రదర్శించుకోవటానికే కేసీఆర్ మొగ్గు చూపిస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తన రాజకీయ ప్రత్యర్థులు తరచూ తన అహంకారాన్ని ఉదాహరణగా చూపిస్తూ ప్రజల్లో వ్యతిరేకత రగిలిస్తున్నారని.. తెలంగాణ ప్రజలు సైతం ఈ తీరుపైనే గుర్రుగా ఉన్నారని కేసీఆర్ మర్చిపోతున్నారు.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రగతిభవన్ లో సమీక్షకు రావాలంటూ శుక్రవారం రాత్రి ఎడెనిమిది గంటల ప్రాంతంలో ఉన్నతాధికారులకు ప్రగతిభవన్ నుంచి సమాచారం అందింది. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ.. కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియాతో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రగతి భవన్ కు వెళ్లారు.

ఉరుకులు పరుగులు పెడుతూ ప్రగతిభవన్ కు వెళ్లిన అధికారులకు షాకింగ్ విషయం తెలిసింది. సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి రిసెన్షన్ కార్యక్రమానికి వెళ్లినట్లుగా తెలీటంతో వారంతా వెయిట్ చేస్తూ ఉండిపోయారు. హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎంత రాత్రి వరకైనా సరే చర్చలు పూర్తి చేసి ఒక నిర్ణయానికి రావాలన్న భావనలో సీఎం ఉన్నట్లుగా అధికారులకు సమాచారం అందింది.

దీంతో.. సీఎం వచ్చే వరకూ వెయిట్ చేసిన వారికి మరో షాక్ తగిలింది. పెళ్లి రిసెప్షన్ కు వెళ్లి వచ్చిన కేసీఆర్ అధికారులతో ఏమీ మాట్లాడకుండా నేరుగా ఇంట్లోకి వెళ్లినట్లుగా తెలిసింది. రిసెప్షన్ కార్యక్రమానికి వెళ్లి వచ్చే వరకూ వెయిట్ చేసిన అధికారులు.. తర్వాత ఇంట్లోకి వెళ్లి కాసేపటికి తిరిగి వచ్చి అధికారులతో ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోవటంతో కాస్త అసౌకర్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. సీఎం షెడ్యూల్ ఎప్పుడూ మినిట్ టు మినిట్ లెక్కగా ఉన్న వేళ.. తాను తిరిగి వచ్చే సమయానికి సీనియర్ అధికారులకు ఆదేశాలు ఇస్తే సరిపోతుంది కదా? అన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏమైనా సీఎం కోసం వెయిటింగ్ తో అధికారులకు చుక్కలు కనిపించాయన్న మాట వినిపిస్తోంది. 
Tags:    

Similar News