వారసుడికి ‘బహిరంగ’ ట్రైనింగ్ షురూనా?

Update: 2016-01-31 07:09 GMT
గ్రేటర్ ప్రచారంలో భాగంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హాట్.. హాట్ గా సాగుతున్న గ్రేటర్ ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును బండకేసి బాదినట్లుగా పదునైన విమర్శలతో కేసీఆర్ విరుచుకుపడ్డారు. దీంతో.. రెండు రోజుల పాటు హైదరాబాద్ గల్లీల్లో మహా జోరుగా సాగిన చంద్రబాబు ప్రచారంతో వచ్చిన సానుకూలత మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా కేసీఆర్ మాటల తూటాలు పేలాయి.

గడిచిన కొద్దికాలంలో బాబు మీద కేసీఆర్ ఈ స్థాయి వ్యాఖ్యలు చేసి చాలా కాలమే అయ్యింది. దీంతో.. మాంచి మసాలాను తలపేంచేలా ఉన్న కేసీఆర్ మాటల మీద దృష్టి పెట్టిన వారు ఒక విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కేసీఆర్ ఎంతో ఇష్టమైన కేటీఆర్ కుమారుడు కమ్ మనమడు హిమాన్షును ఆయన తాజా బహిరంగ సభకు తీసుకొచ్చారు. తన రాజకీయ వారసుడిగా భావించే కేసీఆర్.. ఈ మధ్య కాలంలో తన మనమడ్ని తరచూ తన వెంటబెట్టుకెళ్లటం ఎక్కువైంది.

వినాయకచవితి సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడ్ని చూసేందుకు పార్టీ నేతలు హిమాన్షును తీసుకురావటం.. స్వామిని దర్శించుకున్న తర్వాత తన ముద్దు ముద్దు మాటలు మీడియా ముందు మాట్లాడిన ఈ పిల్లాడు ఈ మధ్యన పలు కార్యక్రమాల్లో కనిపిస్తున్నాడు. మనమడికి పెద్ద పీట వేస్తూ కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

తాను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అయుత చండీయాగం చివరిరోజున తన మనమడ్ని ఆశీర్వదించాలని పండితుల్ని కోరటం.. తన వెంటే ఉంచుకోవటం తెలిసిందే. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి వచ్చిన కేసీఆర్.. తనతో తన మనమడ్ని తీసుకొచ్చారు. ఇలా పలు కార్యక్రమాలకు తన మనమడ్ని తీసుకెళుతున్న కేసీఆర్.. తాజాగా గ్రేటర్ ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు తీసుకురావటం చూస్తే.. మనమడికి రాజకీయ శిక్షణను 11 ఏళ్ల వయసులోనే సీరియస్ గా షురూ చేస్తున్నట్లు కనిపించక మానదు. ఓపక్క తాత.. మరోపక్క తండ్రి ఇస్తున్న ట్రైనింగ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నది తేలటానికి మరికొంత కాలం పడుతుంది.
Tags:    

Similar News