కేసీఆర్‌ ను భుజాన‌కెత్తుకున్న ఏపీ మంత్రి

Update: 2017-10-27 04:39 GMT
పొరుగింటి పుల్ల‌కూర రుచి!! రోజులు మారినా.. కాలాలు మారినా.. ఇది అక్ష‌ర సత్య‌మ‌నేది ఏపీ తెలుగుదేశం నేత‌లను చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. ఇటీవ‌ల టీడీపీ నేత‌ల వ్య‌వహార శైలి చూసినా - వారి వ్యాఖ్య‌లు విన్నా.. వారికి పొరుగింటి నేత‌ల‌పై వ‌ల్ల‌మాలిన ప్రేమ‌ - అభిమానం - ఆప్యాయ‌త‌ - అనురాగం వంటివి అమాంతం పెరిగిపోయాయంటే అతిశ‌యోక్తి కాదేమో! పొరుగు రాష్ట్రంలో టీడీపీ నేత‌ల‌పై క‌నీసం ప్ర‌శంస‌లు కురిపించ‌ని ఏపీ టీడీపీ నేత‌లు.. ఇప్పుడు ఒక ప‌క్కింటి నేత‌పై ప్ర‌శంస‌లు కురిపించేస్తున్నారు. ఆయ‌న‌తో సాన్నిహిత్యం కోసం తెగ ఆరాట ప‌డుతున్నారు. సొంత పార్టీ నేత‌ల కంటే ఎక్కువ‌గా.. ఆ నేతే మాకు ఎక్కువ‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు!!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై ఏపీ టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు.. చూస్తున్న వారికి కేసీఆర్‌తో ఏపీ టీడీపీ నేత‌ల దోస్తీ ఎంత బ‌లంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు! మొన్న‌టికి మొన్న ప‌రిటాల శ్రీ‌రామ్ పెళ్లికి వ‌చ్చిన కేసీఆర్‌ కు ఆహ్వానం ప‌లికేందుకు, ఆయ‌న‌తో మాట్లాడేందుకు ఏపీ టీడీపీ నేత‌లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డం తెలిసిందే! ఇక ప‌య్యావుల కేశవ్ వంటి వారు ఆయ‌న‌తో ర‌హ‌స్యంగా భేటీ అవ‌డం ఎంత‌టి దుమారం రేపిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గ‌తంలోనూ కేసీఆర్ ఏపీకి వ‌చ్చిన సంద‌ర్భంలో నేత‌ల తీరు వివాదాస్ప‌ద‌మైంది!!

చివ‌రికి వీరి వ్య‌వ‌హార శైలి తెలంగాణ‌లో టీడీపీ త‌ర‌ఫున పోరాడుతున్న రేవంత్ రెడ్డి నొచ్చుకునేలా చేసింది. ఇదే స‌మ‌యంలో ఏపీ నేత‌ల తీరును రేవంత్ ఎండ‌గ‌ట్టినా.. దానికి స‌మాధానం చెప్ప‌లేని నేత‌లు మ‌రోసారి కేసీఆర్‌ ను భుజాన కెత్తుకుని మోసేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి - రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి తాజాగా కేసీఆర్‌ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో మేలు అంటూ కితాబిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తెలంగాణ‌లో టీడీపీ నామ‌రూపాలు లేకుండా చేస్తున్న కేసీఆర్‌ ను.. ఇలా ఏపీ మంత్రి ప్ర‌శంస‌ల‌తో ముంచెత్త‌డం ఎంత వ‌ర‌కూ స‌మంజ‌సమో మ‌రి!!
Tags:    

Similar News