ఆఫీసుకెళ్ల‌ని ఆ సీఎం స‌ర్కారు 3కి వెళ్లాడ‌ట‌

Update: 2017-05-17 10:09 GMT
దేశంలో ఇంత‌మంది ముఖ్య‌మంత్రులు ఉన్నా.. త‌ర‌చూ ఏదో ఒక విష‌యం మీద జాతీయ‌స్థాయిలో హైలెట్ కావ‌ట‌మే కాదు.. వివాదాల్లో త‌ర‌చూ ఇరుక్కుపోయే సీఎంగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ను చెప్పాలి. జాతీయ మీడియాలో కేజ్రీవాల్ క‌నిపించినంత ఎక్కువ‌గా మ‌రే సీఎం క‌నిపించ‌రు కూడా. ఇటీవ‌ల కాలంలో సొంత పార్టీ నేత‌లే ఆయ‌న‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

ఒక‌ప్పుడు కేజ్రీవాల్‌కు అత్యంత స‌న్నిహితుడు.. ఆయ‌న మంత్రివ‌ర్గంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన క‌పిల్ మిశ్రా తాజాగా ఆయ‌న‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న్ను పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తూ కేజ్రీవాల్ నిర్ణ‌యం తీసుకున్న నాటి నుంచి.. త‌న విమ‌ర్శ‌ల‌కు మ‌రింత ప‌దును పెట్టారు.

తాజాగా కేజ్రీవాల్ మీద క‌పిల్ మిశ్రా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. సీఎం ఆఫీసుకు వెళ్లేందుకు స‌మ‌యం ఉండ‌ని కేజ్రీవాల్‌.. స‌ర్కారు 3 సినిమాకు మాత్రం వెళ్లార‌ని మండిప‌డ్డారు. గ‌త ఏడాదిలో రెండుసార్లు మాత్ర‌మే త‌న ఆఫీసుకు కేజ్రీవాల్ వెళ్లార‌న్నారు. సీఎం స్నేహితులు.. స‌న్నిహితుల ఇళ్ల‌పై దాడులు నిర్వ‌హిస్తే ఆయ‌న అవినీతి మ‌రింత వెలుగులోకి వ‌స్తుంద‌న్న క‌పిల్ మిశ్రా.. ఆయ‌న తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

"దేశం మొత్తంలోని సీఎంల అంద‌రిలో ప్ర‌జ‌ల్ని అతి త‌క్కువ‌సార్లు క‌లిసిన ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌. ఆయ‌న‌కు ఓ పోర్టు ఫోలియో అంటూ ఉండ‌దు. అతి త‌క్కువ మాత్ర‌మే ప‌ని చేస్తూ.. దాదాపు అన్ని రోజుల్లో సెల‌వులు తీసుకునే ఏకైక ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఒక్క‌రే. ఎక్కువ అవినీతి ఆరోప‌ణ‌లు.. కేసులు న‌మోదైన ముఖ్య‌మంత్రిగా ఆయ‌న మిగిలిపోతారు" అని మండిప‌డ్డారు.

ముఖ్య‌మంత్రికి సంబంధించిన ఎన్నో అవినీతి కార్య‌క్ర‌మాల మీద తాను ప్ర‌శ్నించాన‌ని.. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క దాని మీద కూడా ఆయ‌న స్పందించ‌లేద‌న్న క‌పిల్ మిశ్రా.. రానున్న రోజుల్లో ప్ర‌జ‌లే ప్ర‌శ్నిస్తార‌న్నారు. సీఎం అవినీతి మీద ప్ర‌జ‌లే మాట్లాడ‌తార‌ని.. కానీ ఆయ‌న మాత్రం ఒక క్రిమిన‌ల్ మాదిరి త‌న మీద వ‌చ్చే ఆరోప‌ణ‌ల‌పై మౌనంగా ఉండిపోయార‌ని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మ‌రింత ఘాటుగా రియాక్ట్ అయ్యాక అయినా.. కేజ్రీవాల్ గొంతు విప్పి త‌న వాద‌న‌ను వినిపిస్తారో? లేదో?
Tags:    

Similar News