యూట‌ర్న్: శ‌బ‌రిమ‌ల‌పై మారిన కేర‌ళ స‌ర్కార్ స్వ‌రం!

Update: 2019-06-21 11:28 GMT
ప్ర‌భుత్వం ఏదైనా కానీ త‌న‌కు తోచిన‌ట్లు నిర్ణ‌యాలు తీసుకుంటే ప్ర‌జాగ్ర‌హం త‌ప్ప‌దు. తాజాగా వెలువ‌డిన ప్ర‌జాతీర్పు అనంత‌రం కేర‌ళ‌లోని వామ‌ప‌క్ష స‌ర్కారుకు ఈ విష‌యం బాగానే అర్థ‌మైన‌ట్లుంది. ఒక‌ప‌క్క ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నా.. వామ‌ప‌క్ష మూర్ఖత్వంతో ప్ర‌జ‌ల సెంటిమెంట్ల‌ను దెబ్బ తినేలా వ్య‌వ‌హ‌రించిన తీరుకు తాజాగా వెల్ల‌డైన సార్వ‌త్రిక ఫ‌లితాలతో ప్ర‌జాతీర్పు అర్థ‌మైన‌ట్లుంది.

ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తే వామ‌ప‌క్షాల‌కు దిక్కుగా ఉన్న కేర‌ళలో కూడా అధికారం చేజారిపోతుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. కేర‌ళ ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నా.. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి కొన్ని వ‌య‌స్కుల మ‌హిళ‌ల్ని అనుమ‌తించే విష‌యంలో కేర‌ళ స‌ర్కారు అనుస‌రించిన వైఖ‌రిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కేర‌ళ చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని రీతిలో వేలాది మంది మ‌హిళ‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చి.. ప్ర‌భుత్వ తీరును త‌ప్పు ప‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌ని విజ‌య‌న్ స‌ర్కారు..   తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో స‌మాధాన‌ప‌డిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

కేర‌ళ‌లో బీజేపీకి ప‌ట్టు పెర‌గ‌టం.. ఓట్ల శాతం పెరుగుతున్న తీరును గుర్తించిన ప్ర‌భుత్వం.. శ‌బ‌రిమ‌ల ఆల‌య వివాదంపై మెత‌క వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించాల‌న్న‌ట్లుగా ఉంది. ఇందుకు త‌గ్గ‌ట్లే తాజాగా కేర‌ళ దేవాదాయ శాఖామంత్రి సురేంద్ర‌న్ మాట్లాడుతూ.. ప‌ది నుంచి 50 ఏళ్ల లోపు వ‌య‌సున్న మ‌హిళ‌లు.. బాలిక‌లు ఆల‌యంలోని అనుమ‌తించార‌న్న ఆల‌య సంప్ర‌దాయానికి త‌గ్గ‌ట్లు ఉండాల‌ని భావిస్తున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు.

ఇందుకు త‌గ్గ‌ట్లు కేంద్రం చ‌ట్టం తీసుకురావాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేప‌థ్యంలో ఆల‌యంలోని మ‌హిళ‌ల్ని అనుమ‌తించే విష‌యంలో ప‌రిమితులు విధించేలా కొత్త చ‌ట్టాన్ని తీసుకురావ‌టం కానీ.. అది కుద‌ర‌ని ప‌క్షంలో ప్ర‌స్తుతానికి ఆర్డినెన్స్ తీసుకురావాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఇదే బుద్ధి ముందే ఉంటే.. ఈ రోజున ఇలా కేంద్రాన్ని కోరాల్సిన అవ‌స‌ర‌మే ఉండేది కాదు క‌దా?
Tags:    

Similar News