క‌ల్లులో పోష‌కాలు ఉంటాయి..సుప్రీంలో వాద‌న‌

Update: 2018-01-26 08:28 GMT
వేలాది మంది జీవితాలు ఒక‌వైపు - నిబంధ‌న‌లు మ‌రోవైపు...ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన కేసు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ముందుకు వ‌చ్చింది. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం వాద‌న‌ను ప‌రిశీల‌న‌కు తీసుకుంటూ న్యాయ‌స్థానం త‌దుప‌రి విచార‌ణ‌కు మ‌రింత గ‌డువు ఇచ్చింది. జాతీయ - రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ గతంలో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశం ఫ‌లితం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ర‌కంగా ఉండ‌గా కేర‌ళ‌లో ఎక్కువ మందిపై ప్ర‌భావం చూపింది. 20 కల్లు దుకాణాలు మూతపడగా.. 3వేల మందికి పైగా కల్లుగీత కార్మికులు రోడ్డున పడ్డారు.

దీంతో త‌మ గోడును వెళ్ల‌బోసుకుంటూ వారు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆశ్ర‌యించారు. దీంతో సాధికార కమిటీ నిర్ణ‌యం త‌మ ప్ర‌జ‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపిందో పేర్కొంటూ కేర‌ళ స‌ర్కారు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. సుప్రీం ఆదేశాల మేర‌కు అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌గా...అందులో అనేక ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు ఉండ‌టం గ‌మ‌నార్హం. సాంప్రదాయక భోజనాల్లో కల్లుకు చాలా ప్రాముఖ్యత ఉందని పేర్కొంది. క‌ల్లు పోషక విలువలు కలిగిన విటమిన్‌ పానీయమంటూ అది మద్యం కిందకు కాదని తెలిపింది. `కల్లు ఓ యాంటి-బయోటిక్‌ అన్న విషయం శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. కేన్సర్‌ వ్యాధికి మూలమైన ఓబీఎస్‌-2(OBs-2) కణాలను నిర్మూలించే గుణం కల్లులోని చఖరోమైసెస్‌ అనే సూక్ష్మజీవికి ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా కల్లు కీలకపాత్ర వహిస్తుంది. దీనిద్వారా హాని జరుగుతుందన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదు’ అని స్ప‌ష్టం చేసింది. మద్య నిషేధం విధించబడిన సమయంలో కూడా.. కల్లుపై నిషేధం విధించని విషయాన్ని నొక్కిచెప్పింది. క‌ల్లుకు అనుమ‌తి ఇవ్వాల‌ని అయితే క‌ల్తీ క‌ల్లును అరిక‌ట్టాలని కోరింది.

అయితే కేర‌ళ స‌ర్కారు వాద‌న ప‌ట్ల న్యాయ‌స్థానం ప్ర‌శ్నించింది. క‌ల్లు మద్య‌పానం కాన‌ప్పుడు ఎందుకు అబ్కారీ చ‌ట్టంలో పొందుప‌రిచార‌ని ప్ర‌శ్నించింది. కాగా, తాము ఈ విష‌యంపై అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని కేర‌ళ ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాది వెల్ల‌డించ‌గా...త‌దుప‌రి వాద‌న‌ను ఫిబ్ర‌వ‌రి 16కు న్యాయ‌స్థానం వాయిదా వేసింది.
Tags:    

Similar News