దొంగ బాబాకు లింగ ఛేదం

Update: 2017-05-20 09:32 GMT
దేశంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ దారుణాల నుంచి మహిళలు తమను తాము రక్షించుకోవడం చాలా కష్టమైన పనిగా మారింది. ఎవరికి ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అన్నట్లుగా ఉంది మహిళల పరిస్థితి. అయితే... కొందరు యువతులు మాత్రం ఇలాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. రేపిస్టులకు సరైన శిక్ష వేస్తున్నారు. తాజాగా కేరళలో ఓ యువతి తనను రేప్ చేయబోయిన దొంగ బాబా పురుషాంగాన్ని కసకసా కోసిపారేసింది.
    
కేరళలోని కొల్లమ్‌ లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఒక్కసారిగా వైరల్ గా మారింది. కొల్లమ్‌ లోని పద్మనలో 23 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి గణేషానంద తీర్థపద స్వామి(54) అలియాస్ హరి ఆశ్రమంలో ఉంటోంది. యువతి తల్లిదండ్రులు ఆ దొంగబాబును విశ్వసించి ఆయన ఆశ్రయంలో ఉంటూ సేవలు చేస్తుండేవారు. ఈ క్రమంలో ఆ యువతిపై దొంగబాబా కన్నేశాడు. గత కొంతకాలం నుంచి గణేషానంద స్వామిగా సేవలు పొందుతున్న అతడు యువతిపై వేధింపులకు పాల్పడుతున్నాడు.
    
శుక్రవారం రాత్రి ఏకంగా యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించి, ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. వద్దని ఎంత చెప్పినా బాబా వినకుండా తనపై దారుణానికి యత్నించడంతో అతడి పురుషాంగాన్ని కోసేసింది. ఆ తరువాత తిరువనంతపురం పోలీసులకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పి, ఫిర్యాదు చేసింది. పోస్కో చట్టం కింద అతడిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ గణేషానంద స్వామి తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.  అయితే.. ఆ యువతిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవంతో హర్షం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News