మందు హోండెలివరీకి పిటిషన్..50 వేలు ఫైన్

Update: 2020-03-21 03:30 GMT
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే....చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడట వెనుకటికి ఒకడు. ప్రపంచమంతా కరోనా బారి నుంచి ఎలా బతికి బట్టకట్టాల్రా దేవుడా అనుకుంటుంటే....తాను మాత్రం మందేసి చిందేయాల్సిందేనంటున్నాడో కేరళవాసి. అంతేకాదు, ప్రజలంతా నిత్యావసర సరుకుల కోసం క్యూ లైన్లో నిలబడుతుంటే...తనకు మాత్రం లిక్కర్ హోం డెలివరీ చేయాలంటున్నాడు. ఇంటిదగ్గరికే మందు సరఫరా చేయాల్సిందిగా ఏకంగా హైకోర్టునే ఆశ్రయించాడీ ప్రబుద్ధుడు. ఇంట్లోనే చుక్కేసి కిక్కు తెచ్చుకోవాలనుకున్న మందుబాబు తిక్కను జడ్జిగారు కుదిర్చారు. కేరళలో మందు హోండెలివరీ చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా వేసి షాకిచ్చారు ఆ న్యాయమూర్తి.

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు... కోవిడ్ భయంతో విధించిన ఆంక్షల నేపథ్యంలో మందు కోసం తాగుబోతులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడులో క్యూ వరుసలో తమదైన తెలివిని ప్రదర్శించిన మందుబాబుల ఉదంతం వైరల్ అయింది. తాజాగా, కేరళలో  జ్యోతిష్ అనే మందుబాబు అతి తెలివి ప్రదర్శించి హైకోర్టులో చివాట్లు తిన్నాడు. కరోనా నేపథ్యంలో బార్లు మూతపడడంతో వైన్సుల దగ్గర తాకిడి పెరిగింది. వైన్ ల దగ్గర క్యూలో నిలుచుంటే కరోనా తగులుకుంటుందేమోనని బెంగపడ్డ జ్యోతిష్ బుర్రలో వింత ఆలోచన ఒకటి పుట్టింది. క్యూ లైన్లో నిలుచుంటే కరోనా వస్తుందేమనని భయంగా ఉందని...అందుకని లిక్కర్ హోం డెలివరీ చేయించేలా ఆదేశాలివ్వాలంటూ ఏకంగా కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దేశమంతా ఎమర్జెన్సీ తలపిస్తోంటే... మందు హోం డెలివరీ కావాలా అంటూ  జస్టిస్ జయశంకరన్ నంబియార్ చివాట్లు పెట్టారు.  పొరపాటైందని..పిటిషన్ వెనక్కి తీసుకుంటామని మొత్తుకున్నా జడ్జిగారి కోపం చల్లారలేదు. దీంతో, జ్యోతిష్ కు ఏకంగా యాభై వేల రూపాయల ఫైన్ వేసేశారు జస్టిస్ జయశంకరన్ నంబియార్. అందుకే అన్నారు పెద్దలు...అతి అనర్థదాయకం.


Tags:    

Similar News