కరోనా వైరస్ బారిన పడిన కేరళ నర్సు..

Update: 2020-01-24 05:03 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. తాజాగా చైనాలో పలు నిషేధాలకు కారణం కావటమే కాదు.. డ్రాగన్ దేశానికి కొత్త దడగా మారిన ఈ వైరస్ తాజాగా సౌదీలోని ఒక కేరళ నర్సుకు సోకటం షాకింగ్ గా మారింది. సౌదీ అరేబియాలో ఏ1 హయత్ ఆసుపత్రిలో పని చేస్తున్న ఒక కేరళ నర్సులో గుర్తించారు. దీంతో ఆ దేశంలో నర్సులు పని చేస్తున్న వారంతా ఉలిక్కి పడిన పరిస్థితి.

కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి మురళీధరన్ సైతం కరోనా వైరస్ సోకిన భారత నర్సు ఉదంతాన్ని ధ్రువీకరించారు. సౌదీ ఆసుపత్రిలో మొత్తం వందమంది వరకూ భారతీయ నర్సులు పని చేస్తున్నారు. వీరిలో ఒక్కరికి మాత్రమే కరోనా వైరస్ బారిన పడినట్లుగా గుర్తించారు. ఇంతకూ కేరళ నర్సుకు కరోనా వైరస్ ఎలా సోకిందన్నది చూస్తే.. ఫిలిప్పీన్స్ కు చెందిన నర్సుకు చికిత్స అందించే సమయంలోనే కేరళ నర్సుకు ఈ వైరస్ సోకినట్లుగా భావిస్తున్నారు.

కేరళ నర్సుకు కరోనా వైరస్ సోకటంతో.. కేరళ ప్రాంతం నుంచి వచ్చిన నర్సుల్ని ఒకచోటనిర్బంధించి వారికి ఎక్కడికి వెళ్లనీయటం లేదని సౌదీ మీడియా వర్గాలు చెబుతున్నాయి. రెండు గదుల్లో కేరళ నర్సుల్ని ఉంచేసి వారిని ఎక్కడికి పోనివ్వటం లేదని.. వారికి సరైన పరీక్షలు కూడా నిర్వహించటం లేదని చెబుతున్నారు. తమను నిర్బంధంలో ఉంచినట్లుగా కేరళ నర్సు ఒకరు టీవీ చానల్ తో మాట్లాడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమకు ఎదురవుతున్న చేదు అనుభవంపై భారత ప్రభుత్వం స్పందించాలని వారు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. సౌదీలో పని చేస్తున్న కేరళ నర్సుల్లో ఒక్కరిలో మాత్రమే కరోనా వైరస్ ను గుర్తించిన వైనాన్ని కేంద్రమంత్రి మురళీధరన్ ట్వీట్ తో వెల్లడించారు. మరి.. వారు ఎదుర్కొంటున్న సమస్య మీద కూడా ఫోకస్ పెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News