టైమ్స్ నౌ తాజా సర్వే.. కేరళలో పవర్ ఎవరిదో? ఎందుకో చెప్పారు

Update: 2021-03-09 04:30 GMT
ఉత్తరాదిన ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చే సరికి మాత్రం వారి చేతికి అధికారం దక్కని పరిస్థితి. ఒక్క కర్ణాటక మినహా.. మరే రాష్ట్రంలో ఎంతలా ప్రయత్నించినా అధికార దండం వారి చేతికి రాని దుస్థితి. ఇదిలా ఉండగా.. గడిచిన కొంతకాలంగా కేరళను టార్గెట్ చేసిన కమలనాథులు.. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా 88ఏళ్ల పెద్ద మనిషి కమ్ మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించటం తెలిసిందే.

మరోవైపు కేరళ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పినరయ్ విజయన్ మీద గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటివేళ జరుగుతున్న ఎన్నికల్లో కేరళ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారన్నది ఆసక్తికరం. ఇదే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ మీడియా సంస్థ సీ ఓటరుతో కలిసి ఉమ్మడి సర్వేను నిర్వహించారు. దీని ప్రకారం చూస్తే.. కమలనాథులు కోరుకున్నట్లుగాపవర్ చేతికి రావటం తర్వాత సంగతి.. రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని తేల్చింది.

ఈసారి ఎన్నికల్లో బీజేపీ పాగా వేస్తుందన్న మాటలో ఎలాంటి నిజం లేదని.. అలా జరగటం సాధ్యం కాదని తాజా సర్వే ఫలితం తేల్చింది. పినరయి విజయన్ నేతృత్వంలోని  లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్ డీఎఫ్) కు 82 సీట్లు ఖాయమని.. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తేల్చారు. 140స్థానాలు ఉన్న కేరళలో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన 71 సీట్ల కంటే అధికంగా 11 సీట్లు వస్తాయని చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే వీలుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే కేరళలో పాగా వేయాలని పట్టుదలతో ఉన్న బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని చెబుతున్నారు. కేవలం రెండు సీట్లు రావటం కూడా కష్టమేనని తేల్చింది. 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కాస్త పెరగటం గమనార్హం. అదే సమయంలో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతంమంది కోరుకుంటున్నట్లుగా తేలింది.  ప్రస్తుతం సీఎంగా వ్యవహరిస్తున్న విజయన్ ను మరోసారి సీఎం కావాలని 43. 34 శాతం మంది ఓటేసినట్లు తేలింది. కరోనా వేళ విజయన్ ఉత్తమ పని తీరు కనబర్చారన్న మాట దేశంలోని ఎక్కువ మంది ప్రజల్లో నెలకొని ఉంది. మరి.. ఈ సర్వే ఫలితం ఎంతమేర నిజమన్నది తేలాలంటే మరిన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
Tags:    

Similar News