కేశినేని వారి మాటలు విన్నారా కేసీఆర్?

Update: 2019-10-31 17:30 GMT
తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా అప్పుడప్పుడు వ్యవహరిస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఏదైనా విషయం మీద తాను ఒకసారి కానీ ఫిక్స్ అయితే.. ఇక ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. దగ్గర దగ్గర నాలుగు వారాల నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే.. కించిత్ కూడా కరగని కేసీఆర్ తీరును పలువురు తప్ప పడుతున్నారు.

ఆర్టీసీని మూసేయాలని.. సంస్థను ప్రైవేటీకరణ చేసేసి.. రూట్లను ప్రైవేటు వారి పరం చేస్తే చాలు.. ప్రభుత్వానికి మస్తు ఆదాయమే కాదు.. ప్రజలకు కూడా మంచి లాభం జరుగుతుందన్న మాటను చెబుతున్న కేసీఆర్ మాటలకు పలువురు అవాక్కు అవుతున్నారు. వ్యాపారస్తుడు ఎవరూ లాభం కోసం వ్యాపారం చేస్తారన్న విషయాన్ని కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

అయినా.. ఇదేమీ పట్టని కేసీఆర్.. తాను ఫిక్స్ అయినట్లుగా ఆర్టీసీ విషయాన్ని లెక్క తేల్చేయాలని.. దేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేరంటూ పెద్ద మాటల్నే చెప్పేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా కలిగే ప్రయోజనాల్ని తాజాగా ప్రస్తావించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.

సుదీర్ఘకాలం బస్సుల వ్యాపారంలో నలిగిన పెద్ద మనిషి.. ఈ మధ్యన సదరు వ్యాపారం నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. బస్సుల వ్యాపారంలో ఎత్తుపల్లాలు కేశినేనికి తెలిసినంతగా కేసీఆర్ కు అయితే తెలీదనే చెప్పాలి. అలాంటి ఆయనే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పొగడటం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాల్ని ఇస్తుందన్నారు.

ఆర్టీసీని కాపాడటాన్ని ఏపీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందన్న ఆయన.. లాభాలు వచ్చే మార్గాల్లోనే ప్రైవేటు బస్సులు నడుపుతాయని.. నష్టాలు వచ్చే మార్గంలో ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు నడపరని.. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు.  ఓపక్క కేసీఆర్ సారు వారేమో తెలంగాణలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తానని చెబుతున్న వేళ.. ఏపీ సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వంలోకి కలిపివేసుకోవటం.. ఆ దిశగా అడుగులు వేయటాన్ని మర్చిపోకూడదు. బస్సుల వ్యాపారంలో పుట్టి పెరిగి.. అందులోనే మునిగిన కేశినేని లాంటి పెద్ద మనిషి మాట్లాడిన మాటల్ని తెలంగాణ సారు వారికి ఎవరైనా వినిపిస్తే.. ఆయన మనసుకు వాస్తవాలు తెలిసే అవకాశం ఉందేమో? ఎవరైనా ఒక్కసారి ట్రై చేస్తే బాగుంటుందేమో?
Tags:    

Similar News