'వీరగ్రంథం'పై ఉలికిపాటెందుకు?: కేతిరెడ్డి

Update: 2017-10-26 13:03 GMT

ఎన్టీఆర్ జీవిత చరిత్రను ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పేరుతో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు తమిళనాడు తెలుగు యువశక్తి  అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తేజ‌ - వ‌ర్మ ల బ‌యోపిక్ ల మ‌ద్య‌లో జ‌రిగిన విష‌యాల‌ను తన సినిమాలో చూపించ‌బోతున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఎన్టీఆర్ జీవితంలో మొదటి, ఆఖరి భాగాలు కాకుండా మధ్యలో జరిగిన విషయాలను తెరకెక్కిస్తానన్నారు. లక్ష్మీపార్వతి పాత్ర‌లో వాణీ విశ్వ‌నాథ్‌ - ల‌క్ష్మీ పార్వ‌తి మొదటి భర్త వీరగంధం సుబ్బారావు పాత్ర‌లో ఎల్బీ శ్రీ‌రాం న‌టించే అవ‌కాశ‌ముంద‌ని చెప్పారు.  ఎన్టీఆర్ ఘాట్ వద్ద మౌనదీక్ష చేసిన అనంత‌రం ఈ సినిమాపై ల‌క్ష్మీ పార్వ‌తి మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోని వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రించి సినిమా తీయాల‌ని చూస్తే తాను కోర్టుకు వెళ్ల‌డానికైనా సిద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ చిత్రానికి త‌న అనుమ‌తి కోరుతూ ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని ల‌క్ష్మీ పార్వ‌తి అన్నారు. ఈ నేప‌థ్యంలో ల‌క్ష్మీ పార్వ‌తిపై జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  

వాస్తవ ఘటనల‌ను మాత్ర‌మే తాను తెరకెక్కించాలని భావిస్తుంటే, లక్ష్మీ పార్వతికి ఉలుకెందుకని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎన్టీఆర్ చరిత్రపై ముందు భాగం తీస్తానన్న తేజ‌కు - చివరి భాగం తీస్తానన్న వర్మకు ఆమె అభ్యంతరం చెప్పలేద‌ని, మధ్య భాగం తీస్తానన్న త‌న‌పై ఇంత ఉలికిపాటు ఎందుక‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆ మ‌ధ్య భాగంలో జ‌రిగిన క‌థ వెనుక చాలా ఘ‌టనలున్నాయని త‌న‌కు అనుమానమ‌న్నారు. బహిరంగ వేదికపై చర్చకు తాను సిద్ధమ‌ని, ఆమె కూడా సిద్ధమా? అని ప్ర‌శ్నించారు. వీరగంధం సుబ్బారావు హ‌రిక‌థ‌లు చెప్పుకొని జీవించాడ‌ని, ఆయ‌న‌ జీవితకథను నేను సినిమాగా తీస్తానంటే అభ్యంతరం ఎందుకని అడిగారు. ఒక‌వేళ తనను అడ్డుకోవాలని లక్ష్మీపార్వతి భావిస్తే కోర్టుకు వెళ్లవచ్చన్నారు. ఎవ‌రెన్ని అడ్డంకులు సృష్టించినా ఆ సినిమా తీసి తీరుతానని చెప్పారు. జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ల‌క్ష్మీ పార్వ‌తి ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Tags:    

Similar News