అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Update: 2022-10-21 08:53 GMT
అమరావతి రైతులు ప్రస్తుతం అమరావతి నుంచి అరసవెల్లి వరకు పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రైతుల పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సాగుతోంది. రెండు రోజుల క్రితం రాజమండ్రిలో అమరావతి రైతులకు, వైసీపీ నేతలకు మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ యాత్రపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు, మరో ఇద్దరు లంచ్‌మోషన్‌ రూపంలో దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది.

ఈ సందర్భంగా కోర్టు అనుమతించిన 600 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఎవరైనా పాదయాత్రకు సంఘీభావం తెలపాలనుకుంటే రోడ్డు పక్కనే ఉండి సంఘీభావం తెలపాలి. వారు పాదయాత్రలో పాల్గొనకూడదు. పాదయాత్రకు నాలుగు వాహనాలను మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువ మంది పాదయాత్రలో ఉంటే పోలీసులు చర్యలు తీసువచ్చని తెలిపింది. తమ ఆదేశాలకు లోబడే రైతుల పాదయాత్ర జరగాలని హైకోర్టు పేర్కొంది. ఈ 600 మందిలో కూడా రైతులు మాత్రమే ఉండాలంది.

రైతులు మినహా మిగిలిన వారెవరూ పాదయాత్రలో పాల్గొనకుండా రోప్‌ పార్టీతో తగిన చర్యలు చేపట్టేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు  వెల్లడించింది. అలాగే రూట్‌మ్యాప్‌ ప్రకారం యాత్ర జరిగేచోట అదేరోజు ఇతర పార్టీలు ఎలాంటి పోటీ కార్యక్రమాలు చేపట్టకుండా ఆదేశాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది.

కోర్టు ఆదేశాలకు లోబడి యాత్ర సాగేందుకు ఎలాంటి ఆదేశాలు కావాలో తెలియచేయాలని అటు పిటిషనర్‌ను, ఇటు పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్‌ 22 శుక్రవారానికి వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా హోంశాఖ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ హైకోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్నవారు అడుగడుగునా న్యాయస్థానం విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించారు. యాత్ర చేస్తున్న వారు తొడలు కొడుతూ రెచ్చగొడుతున్నారన్నారు. యాత్రలో పాల్గొనేందుకు హైకోర్టు 600 మందికే అనుమతినిస్తే రోజూ వేల సంఖ్యలో పాల్గొంటున్నారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. వీరిలో టీడీపీ నేతలు, కార్యకర్తలే ఉన్నారని చెప్పారు.

అభ్యంతరకర నినాదాలు చేయడం, రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లే రాజమహేంద్రవరం ఘటన జరిగిందని, ఇందుకు నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ కోర్టుకు నివేదించారు.

ఈ నేపథ్యంలో యాత్ర క్షేత్రస్థాయిలో ఎలా సాగుతోంది? నిర్వాహకులు కోర్టు ఆదేశాలను ఎలా ఉల్లంఘిస్తున్నారు? టీడీపీ నాయకులు సంఘీభావం పేరుతో ఏం చేస్తున్నారు? తదితర అంశాలతో అనుబంధ పిటిషన్‌ను ప్రభుత్వం వేస్తుందన్నారు. పాదయాత్రకు ఇచ్చిన అనుమతులు కోర్టు రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌ను పరిశీలించిన తరువాత తగిన నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. ఏజీ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు అనుబంధ పిటిషన్‌ దాఖలుకు అనుమతినిచ్చింది.

మరోవైపు సాధారణ ప్రజానీకం తమ యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారని, వారిని ఎలా అడ్డుకోగలమని అమరావతి రైతుల తరఫున ఉన్నం మురళీధరరావు వాదించారు.

అమరావతి రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మురళీధరరావు కోర్టు దృష్టికి తెచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News