వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సాక్షి గంగాధరరెడ్డి అనుమానాస్పద మృతి

Update: 2022-06-09 07:30 GMT
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధరరెడ్డి అనంతపురం జిల్లా యాడికిలో ఆయన ఇంట్లోనే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి అనారోగ్య కారణాలతో చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డికి గంగాధరరెడ్డి ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. వివేకా హత్యకు సంబంధించి సీబీఐ ఇప్పటికే పలుమార్లు గంగాధరరెడ్డి విచారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని రెండుసార్లు సీబీఐ ఎస్పీని గంగాధరరెడ్డి కలవడం గమనార్హం.

దీంతో గంగాధర్ రెడ్డి మరణం పై పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇల్లు, పరిసరాల్లో ఆధారాలు సేకరించారు. క్లూస్‌ టీమ్‌ కూడా రంగంలోకి దిగి ఇంటి పరిసరాలను పరిశీలిస్తోంది. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తాడిపత్రికి తరలించారు.

వాస్తవానికి గంగాధరరెడ్డి (49) స్వగ్రామం పులివెందుల అయినప్పటికీ ప్రేమ పెళ్లి చేసుకుని అనంతపురం జిల్లా యాడికిలో నివాసముంటున్నాడు. అతడిపై రౌడీ షీట్ కూడా ఉంది. పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. పలువురి హత్యతోనూ సంబంధాలున్నాయి. సీబీఐ అధికారులు తనను బెదిరించి దేవిరెడ్డి శంకర్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమంటున్నారని గంగాధరరెడ్డి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా వారిద్దరిని నిందితులని సాక్ష్యం ఇస్తే పది కోట్ల రూపాయలు ఇస్తామని తనకు ఆశపెట్టినట్టు గంగాధరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం రేపాడు.

కాగా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత తన తండ్రి మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు 2020లో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. 2021 అక్టోబర్ 26న ఛార్జిషీటును దాఖలు చేసింది.

మరోవైపు సీబీఐ పులివెందులలో వివేకా హత్య కేసు విచారణను ముమ్మరం చేసింది. వివేకా ఇంటి కొలతలతో పాటు మరికొందరు అనుమానితుల సమాచారం సేకరిస్తోంది. ఇప్పుడు సాక్షిగా ఉన్న గంగాధర రెడ్డి అనుమానస్పద మరణం పైన పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. గంగాధరరెడ్డి మృతిని అనుమానాస్పద మరణం కింద నమోదు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News