అవమానంతోనే రాజీనామా : అమరీందర్ సింగ్

Update: 2021-09-18 15:47 GMT
పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు అమరీందర్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అనంతరం అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తనకు ఇలా జరగడం ఇది మూడోసారి అని వెల్లడించారు. సొంతపార్టీలోనే అసమ్మతి కారణంగా తీవ్ర వేదనకు గురయ్యానని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఎవరిపై నమ్మకం ఉంటె వారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవచ్చు అని అన్నారు. ప్రస్తుతానికి నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని , అతి త్వరలో అనుచరులతో చర్చించి , భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటాను అని అన్నారు.

ఇదిలా ఉంటే .. మరికొన్ని నెలల్లో పంజాబ్ ఎన్నికలు ఉన్న తరుణంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవి నుంచి తప్పుకోవడం పంజాబ్ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది. గత కొన్నినెలలుగా అమరీందర్ సింగ్ ప్రభుత్వానికి అసమ్మతి పోటు తప్పడంలేదు. సీఎంగా అమరీందర్ సింగ్ అనర్హుడని 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అంతకుముందే పంజాబ్ సర్కారులో అసమ్మతి గళం రాజుకుంది. నలుగురు మంత్రులు, రెండు డజన్ల మందికి పైగా ఎమ్మెల్యేలు తమకు అమరీందర్ నాయకత్వంపై నమ్మకంలేదని వ్యాఖ్యలు చేశారు.

ప్రధానంగా సొంత పార్టీ నేత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూతో కొంతకాలంగా తీవ్ర పోరాటం సాగిస్తున్న అమరీందర్ సింగ్ కు ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ షాకిచ్చింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా నియమించింది. ఈ పరిణామం అమరీందర్ సింగ్ ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సిద్దు నియమించిన పార్టీ సలహాదారులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అగ్నికి మరింత ఆజ్యం పోయగా, వాటిని అమరీందర్ సింగ్ ఖండించారు. అప్పటినుంచే కెప్టెన్ కు కౌంట్ డౌన్ మొదలైందని భావిస్తున్నారు. కాగా, పంజాబ్ కొత్త సీఎం రేసులో ముగ్గురి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సునీల్ జఖార్, ప్రతాప్ సింగ్ బాజ్వా, రవ్ నీత్ సింగ్ బిట్టూలలో ఒకరికి సీఎం పదవి లభించే అవకాశాలు ఉన్నాయని ఓ వార్త ప్రచారం అవుతోంది.వీరిలో ఎవరికి ఆ అదృష్టం దక్కుతుందో.



Tags:    

Similar News