పాతిక‌మందిలో కీల‌కం ఎవ‌రంటే?

Update: 2019-06-09 06:11 GMT
ఆచితూచి అన్న‌ట్లు నిర్ణ‌యాలు తీసుకుంటున్న ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. తాజాగా కొలువు తీరిన కేబినెట్ కూర్పును చూస్తే.. జ‌గ‌న్ మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. కులాల కుంప‌ట్లుగా ఉండే ఏపీలో.. రొటీన్ కాంబినేష‌న్ల‌కు పంచ్ ఇచ్చి.. త‌న‌దైన స‌రికొత్త కాంబినేష‌న్ ను తెర మీద‌కు తీసుకొచ్చారు జ‌గ‌న్‌. కేబినెట్ క‌స‌ర‌త్తులో సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాల‌కు వెనుకాడ‌లేదు జ‌గ‌న్‌.

రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప‌రిమిత ప్రాధాన్య‌త ఇచ్చిన జ‌గ‌న్‌.. త‌న‌కు వెన్నంటి ఉన్న ఎస్సీ ప్రాధాన్య‌త ఇవ్వ‌టంతో పాటు.. బీసీల‌కు పెద్ద పీట వేయ‌టం ద్వారా కొత్త కాంబినేష‌న్ ను ఆవిష్క‌రించార‌ని చెప్పాలి. పెద్ద ఎత్తున నేత‌ల పోటీ ఉన్న‌ప్ప‌టికీ.. ఎంపిక విష‌యంలో మొహ‌మాటాల‌కు తావివ్వ‌కుండా తానేం చేయాలో అదే చేస్తాన‌న్న‌ట్లుగా మంత్రివ‌ర్గం కూర్పు ఉంద‌ని చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేబినెట్ మంత్రుల్లో కీల‌క ప‌ద‌వుల్ని కొన్ని జిల్లాల నేత‌ల‌కు అధిక ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. శాఖ‌ల కేటాయింపులో బీసీ కోటాలో ఉప ముఖ్య‌మంత్రిగా ఎంపిక చేసిన సుభాష్ చంద్ర‌బోస్ కు రెవెన్యూ.. రిజిస్ట్రేష‌న్ల విభాగం ల‌భించింది. ఇది అత్యంత ప్రాధాన్య‌మున్న శాఖ‌. భూములు రీస‌ర్వే చేయాల‌న్న జ‌గ‌న్ స‌ర్కారు ప్రాధాన్యంగా నిర్ణ‌యించుకున్న అంశాల్లో ఒక‌టి. అలాంటి వాటితో ముడిప‌డి ఉన్న శాఖ బోస్ ద‌క్కించుకోవ‌టం అంటే.. ఆయ‌న మీద జ‌గ‌న్ న‌మ్మ‌కం పెట్టుకున్న‌ట్లే.

వైద్య‌శాఖ‌ను స‌మూలంగా సంస్క‌రించాల‌ని.. వైఎస్ ఆర్ ఆరోగ్య‌శ్రీ‌ని భారీగా విస్త‌రించాల‌ని భావిస్తున్న ప్ర‌భుత్వం.. ఈ శాఖ బాధ్య‌త‌ల్ని కాపుల నుంచి ఉప ముఖ్య‌మంత్రిగా ఎంపిక చేసిన ఆళ్ల నానికి అప్ప‌గించారు. ఇక‌.. ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న విద్యాశాఖ‌ను ఎంటెక్.. పీహెచ్ డీ చేసిన ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఆదిమూల‌పు సురేశ్ కు అప్ప‌జెబుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితులైన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి.. మేక‌పాటి గౌతం రెడ్డి.. బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డిల‌కు కీల‌క శాఖ‌లు ద‌క్కాయి. ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామికి ఆదాయ ఆర్జ‌న ప‌రంగా కీల‌క‌మైన ఎక్సైజ్.. వాణిజ్య ప‌న్నుల శాఖ‌లు ద‌క్కాయి. మ‌ద్యం దుకాణాల సంఖ్య‌ను క్ర‌మంగా త‌గ్గిస్తూ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌కే మ‌ద్యం స‌ర‌ఫ‌రాను ప‌రిమితం చేయాల‌న్న జ‌గ‌న్ ల‌క్ష్యం తెలిసిందే.

భారీ ల‌క్ష్యాన్ని పెట్టుకున్న జ‌గ‌న్‌.. ఆ దిశ‌గా అడుగులు వేయ‌టం అంత తేలికైన విష‌యం కాదు. ఎందుకంటే మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా ప్ర‌తి ఏటా రాష్ట్ర ప్ర‌భుత్వానికి రూ.17వేల కోట్ల ఆదాయం ల‌భిస్తోంది. అంత భారీ ఆదాయాన్ని వ‌దులుకొని మ‌ద్య‌నిషేధం వైపు అడుగులు వేయ‌టం సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌గా చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈ కీల‌క‌మైన శాఖ‌ను ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామికి అప్ప‌చెప్పారు.

జ‌గ‌న్ ల‌క్ష్యానికి త‌గ్గ‌ట్లు అడుగులు ప‌డిన‌ప్పుడు రెవెన్యూ కోత ప‌డే ఎక్సైజ్ ను.. ఆదాయాన్ని పెంచాల్సిన వాణిజ్య ప‌న్నుల శాఖ‌ను నారాయ‌ణ స్వామికి అప్ప‌జెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా చెప్పాలి. రెండు కీల‌క‌మైన శాఖ‌ల్ని ఆయ‌నకు జ‌గ‌న్ ఇవ్వ‌టం అంటే..పెద్ద బాధ్య‌త‌ను ఆయ‌న మీద పెట్టిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News