వీర‌బ్ర‌హ్మం మ‌ఠంపై మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

Update: 2021-06-13 23:30 GMT
క‌డ‌ప జిల్లాలోని వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఎవ‌రికి ద‌క్కాల‌నే విష‌య‌మై కొన్ని రోజులుగా వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇన్నాళ్లూ మ‌ఠాధిప‌తిగా ఉన్న వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి గత నెలలో మరణించారు. 11వ మ‌ఠాధిప‌తిగా ఉన్న ఆయ‌న‌.. దాదాపు 52 సంవ‌త్స‌రాలు కొన‌సాగారు. 75 సంవ‌త్స‌రాల వ‌య‌సులో తుదిశ్వాస విడిచారు.

ఆయ‌న ప‌ర‌మ‌ప‌దించిన త‌ర్వాత పీఠాధిప‌త్యం కోసం వార‌సుల మ‌ధ్య పోటీ మొద‌లైంది. త‌మ‌కే ద‌క్కాలంటూ ఎవ‌రికి వారు గొడ‌వ‌ ప‌డుతున్నారు. ఈ వివాదం ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. వివిధ మ‌ఠాలు, పీఠాల‌కు చెందిన అధిప‌తులు జోక్యం చేసుకుని స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర దేవాదాయ‌శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. బ్ర‌హ్మాగారి మ‌ఠాధిప‌త్యంపై త‌మ‌కు ఎలాంటి వీలునామా అంద‌లేద‌ని చెప్పారు. దేవాదాయ చ‌ట్టం ప్ర‌కారం 90 రోజుల్లో వీలునామా అందాల్సి ఉంద‌న్నారు. ఆ త‌ర్వాత పీఠాధిప‌త్యంపై దేవాదాయ శాఖ ప‌రిధిలో క‌మిటీ వేసి, నిర్ణ‌యిస్తామ‌ని చెప్పారు.

ఎంతో చ‌రిత్ర‌, ప్రాముఖ్య‌త క‌లిగిన బ్ర‌హ్మంగారి పీఠాన్ని వివాదాల్లోకి లాగొద్ద‌ని, స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు. మ‌ఠాధిప‌తులు, పీఠాధితులు త‌మ స‌ల‌హాల‌ను ప్ర‌భుత్వానికి అందించాల‌ని కోరారు. సంప్ర‌దాయం, చ‌ట్టం ప్ర‌కారం పీఠాధిప‌తి ఎంపిక జ‌రుగుతుంద‌ని చెప్పారు.




Tags:    

Similar News