అక్కడ గౌరవం : వైఎస్సార్టీపీలో విజయమ్మకు కీలక బాధ్యతలు ...?

Update: 2022-07-09 16:30 GMT
వైసీపీ పెట్టి పదకొండేళ్ళు దాటిపోయింది. ఆ పార్టీ పుట్టినపుడు జగన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక ఆయనతో పాటు గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ కూడా నాటి నుంచి కొనసాగుతున్నారు. ఆ హోదాలో ఆమె పార్టీ కోసం ఎంతో చేశారు. ఎన్నో మీటింగ్స్ లో పాలుపంచుకున్నారు. 2014, 2019 ఎన్నికల వేళలలో  ఏపీవ్యాప్తంగా తిరిగారు. ఇక ఇలా ఇన్నేళ్ళ కాలంలో విజయమ్మ వైసీపీ కోసం చాలానే చేశారు. అయితే ఆమె ఇపుడు ఆ పదవి నుంచి తప్పుకున్నారు.

ఆమె ఒక విధంగా ఫ్రీ అయిపోయారు. ఏపీతోనూ, అక్కడ రాజకీయాలతోనూ ఆమెకు ఏ రకమైన రాజకీయ సంబంధాలు లేవు. ఆమె తన చూపు దృష్టి అంతా కుమార్తె షర్మిల వైపే ఉంచారు. తెలంగాణాలో షర్మిల పెట్టిన వైఎస్సార్టీపీలో విజయమ్మ ఇక మీదట కీలకమైన భూమిక పోషిస్తారు అని తెలుస్తోంది. నిజానికి విజయమ్మ చాలాకాలంగా కూతురు పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. షర్మిల పాదయాత్రలో సైతం ఆమె పలు మార్లు పాల్గొన్నారు. షర్మిలకు మద్దతుగా మాట్లాడుతున్నారు.

ఆమె పోరాటాలకు డైరెక్ట్ గా మద్దతు ఇస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమె విమర్శల పాలు అయ్యారు. వైసీపీలో గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ వేరే పార్టీలో ఆమె చురుకైన పాత్ర పోషించడం పట్ల కూడా మీడియాలో కధనాలు వచ్చాయి. ఒక విధంగా ఆమె వైసీపీకి దూరం అయ్యారని చాలా కాలంగా వినిపిస్తూ వచ్చిన మాట. ఎట్టకేలకు ప్లీనరీ వేదికగా అదే నిజం అయింది. ప్రారంభంలోనే ఆమె తన రాజీనామా ప్రకటన చేసి సంచలనం రేపారు.

ఇదిలా ఉంటే వైసీపీకి  విజయమ్మ రాజీనామా చేశాక ఇక వైఎస్సార్టీపీలో గౌరవ అధ్యక్షురాలిగా ఉంటారని అంటున్నారు. ఈ మేరకు షర్మిల రంగం సిద్ధం చేశారని చెబుతున్నారు. రానున్న రోజుల్లో తల్లీ కూతుళ్ళు ఇద్దరూ కలసి తెలంగాణాలోనే తమ రాజకీయ దూకుడు చూపిస్తారు అని అంటున్నారు. అయితే విజయమ్మ తెలంగాణా పార్టీలో ఉండడం వైసీపీకి కలసివచ్చే అంశమా కాదా అంటే దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి.

ఆమె అక్కడ నుంచి తెలంగాణా వాణి వినిపిస్తే ఏదో ఒక విధంగా అది వైసీపీకి ఇబ్బంది పెట్టేదే అవుతుంది అని అంటున్నారు. రానున్న రోజుల్లో ఆమె ఏపీలో ప్రచారం నిర్వహించే అవకాశం కూడా ఉండకపోవచ్చు అని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే కుమార్తెకు మద్దతుగా రేపటి ఎన్నికల్లో ఆమె ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఆమె వైఎస్సార్ పధకాల గురించే జనాలకు చెప్పాలి. వచ్చే ఎన్నికలు అంటే దాదాపు పద్నాలుగేళ్ల క్రితం వైఎస్సార్ సీఎం గా ఉన్న విషయాలు జనాలకు ఎంత మేరకు చేరుతాయన్నది చూడాలి.

దాంతో పాటు తెలంగాణా రాజకీయాలలో  పూర్తిగా   కొత్త పాత్రగా విజయమ్మకు ఇది ఉంటుంది అంటున్నారు. తెలంగాణా రాజకీయాల్లో కాంగ్రెస్ సైతం బలంగా ఉంది. ఆ పార్టీని ఢీ కొట్టి ఓట్లు తమ వైపు తెచ్చుకోవడం, మిగిలిన పార్టీలను ధీటుగా ఎదుర్కోవడం అన్నది కష్టత‌రమైన వ్యవహారం. ఇంకో వైపు చూస్తే తెలంగాణాలో షర్మిల పార్టీకి ఈ రోజుకు పేరున్న నేతలు ఎవరూ చేరలేదు. ఇపుడు వైఎస్సార్ సతీమణిగా విజయమ్మ చేరిక కనుక ఉంటే ఆమె గౌరవ అధ్యక్షురాలిగా ఉంటే కొంత ఊపు రావచ్చు.

అదే టైమ్ లో ఏపీలో చూస్తే వైసీపీకి విజయమ్మ లేని లోటు బాగానే కనిపిస్తుంది అంటున్నారు. తల్లీ చెల్లెమ్మల సపోర్ట్ జగన్ కి బాగా ఉపయోగపడ్డాయని చెబుతారు. ఫలితాలు కూడా దాన్ని రుజువు చేశాయి. ఇక ఈ ఇద్దరూ ప్రచారంలో లేని వచ్చే ఎన్నికలలో  దాని పర్యవశానాలు వచ్చే ఎలా  కనిపిస్తాయా అంటే సరైన సమాధానం కోసం వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News